- మరో కమిటీ వేయాలని ప్రభుత్వ నిర్ణయం
- మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో అసలేం జరిగింది..?
మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. బాలింతలిద్దరూ ఇన్ఫెక్షన్స్ తో పాటు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చారని, అదీ కూడా వారి మరణానికి ఒక కారణమని అధికారులు ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. గాంధీ, నిమ్స్ ఆస్పత్రులకు చెందిన వైద్యులతో విచారణ కమిటీ వేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి హరీశ్ రావు గురు, శుక్రవారాల్లో మలక్ పేట ఏరియా ఆస్పత్రి ఘటనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో అసలేం జరిగింది..?
మలక్ పేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి బాలింతల మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు మరిన్ని రికార్డులను అధికారులు తెప్పించుకుంటున్నారు. బాలింతల మరణాలకు గల కారణాలను ఇంకా తేల్చకపోవడంతో వారి మృతి మిస్టరీగా మారింది. బాలింతలు చనిపోయి అయిదు రోజులు గడిచినా కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికను ఇప్పటికే ఫోరెన్సిక్ వైద్యులు పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. మరోవైపు విచారణ కమిటీ సభ్యులు రెండుసార్లు ఆస్పత్రికి వచ్చి ఘటనపై సమాచారం సేకరించారు. మంగళవారం కూడా ఆస్పత్రి రోగుల రికార్డులను, బాలింతల కేస్ షీట్లను కూడా అధికారులు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మందుల వినియోగం, నాణ్యతను పరిశీలించిన అధికారులు వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించారు. ఆపరేషన్ థియేటర్ లో శుభ్రత లేదని ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. దీని కారణంగానే బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానిస్తున్నారు. అధికారులు విచారణను కూడా తు తు మంత్రంగానే చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇంత పెద్ద సంఘటన జరిగిన కూడా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. కాలయాపన చేసి మరుగున పడేయాలని చూస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిమ్స్ లో డిశ్చార్జికి ఇష్టపడని బాలింతలు..
నిమ్స్ చికిత్స పొందుతున్న ఏడుగురు బాలింతల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినా ఇంటికి వెళ్లడానికి సుముఖత వ్యక్తం. చేయడంలేదని సమాచారం. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆస్పత్రిలోనే ఉంటామని వైద్యులను వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో తగ్గిపోయిన ప్రసవాలు
మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో సాధారణంగా రోజుకు 8 నుంచి 12 ప్రసవాలు జరుగుతుంటాయి. రోజూ ఇక్కడ ఓపీలో 300 నుంచి 400 వరకు గర్బి ణులు ఉంటారు. అయితే ఇద్దరు బాలింతలు చనిపోవడంతో నాటినుంచి ఓపీకి గర్భిణుల రాక చాలా మేరకు తగ్గిపోయింది. రోజూ 75 నుంచి 100 లోపే వస్తున్నారు. ప్రసవాల సంఖ్య కూడా మంగళవారం ఒక్కటే జరిగినట్లు తెలిసింది. మరోవైపు మలక్ పేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్లను కూడా నిలిపివేశారు. సిజేరియన్ అవసరమైన గర్భిణులను కింగ్ కోఠి ప్రభుత్వ ఆస్పత్రి, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రులకు తరలిస్తున్నారు.