కాకినాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దాపురం మండలం జి.రాఘంపేట అంబటి ఆయిల్స్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ రోజు ఉదయం పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా… పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకర్లో ఆయిల్ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులకు ఊపిరి అందలేదు. వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు బయటకు రాకపోవడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే ట్యాంకర్‌ను అప్పటికప్పుడు యంత్రాలతో కూల్చి అందరినీ బయటకు తీసుకువచ్చారు. వారంతా ఊపిరాడక చనిపోయినట్లు తోటి కార్మికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
యాజమాన్యం నిర్లక్ష్యం…
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం ప్రాంతం అనేక పరిశ్రమలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో అనేక రకాల ఆయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో అంబటి ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా అంబటి ఆయిల్ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఈ పరిశ్రమలో ఇది రెండో ప్రమాదంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఏడుగురు కార్మికుల మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయిల్ ట్యాంకర్లో కార్మికులు దించే క్రమంలో వారికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించాల్సి ఉంటుంది. ట్యాంకర్లో వచ్చే ఘాటైన వాయువులను తట్టుకునేందుకు మాస్క్‌లతో పాటు రక్షణ కవచాలు అందించాల్సి ఉంటుంది. అయితే రక్షణ కవచాలు అందించడంతో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆయిల్ ట్యాంకర్‌లోకి వెళ్లిన కార్మికులు సమయం గడుస్తున్నప్పటీ ఎందుకు బయటకు రాలేదో అనే విషయాన్ని కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఏడుగురు కార్మికులు చనిపోయారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
మృతుల వివరాలు…
మృతులు పాడేరుకు చెందిన మొచ్చంగి కృష్ణా, మొచ్చంగి నరసింగా, మొచ్చంగి సాగర్, కురతాడు బంజు బాబు, కుర్ర రామారావు, పులిమేరు గ్రామానికి చెందిన కట్టమురి జగదీష్, ప్రసాద్‌గా గుర్తించారు. వీరి మరణావార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.