నిజాయితీ అధికారికి బదిలీ బహుమానం

  • వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి హైదరాబాద్‌కు బదిలీ
  • నిజాయితీ అధికారిగా జిల్లాలో గుర్తింపు
  • జిల్లా అటవీ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే బదిలీ
  • రాజకీయ ఒత్తిళ్లతోనే ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు ప్రచారం
  • 200 ఎకరాల ఫారెస్ట్ భూమిని కాపాడడమే నేరం..?

వికారాబాద్‌ జిల్లాలో అడవుల పరిరక్షణకు చట్టపరంగా వ్యవహరిస్తున్న అధికారికి రాష్ట్ర ఉన్నతాధికారులు బదిలీ బహుమానంగా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారిగా ఆయన పని చేసింది కేవలం 6 నెలలు మాత్రమే, కానీ ఇప్పటివరకు జిల్లాలో ఏ ఫారెస్ట్ అధికారి చేయలేనంత నిజాయితీగా తన బాధ్యతలను నెరవేరుస్తూ, జిల్లాలో దాదాపుగా 200 ఎకరాల ఫారెస్ట్ భూమిని కాపాడడంలో భాగంగా చివరికి కోర్టుని సైతం ఆశ్రయించాడు. ఆయనే వికారాబాద్ జిల్లా డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి. ఇంత నిజాయితీగా పనిచేసిన ఈ అధికారికి చివరికి ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, నేడు నిజాయితీగా పనిచేసే అధికారులకు బదిలీలు తప్పవని జిల్లాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నికకు ముందు వెంకటేశ్వర్ రెడ్డి యాదాద్రి జిల్లా నుంచి వికారాబాద్‌ జిల్లా అటవీ శాఖ అధికారిగా వచ్చారు. వికారాబాద్‌ జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభం నుంచే కఠినంగా వ్యవహరించారు. అటవీ సంపదకు, పర్యావరణానికి నష్టం కల్గిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టారు. అటవీ భూముల్లో మైనింగ్‌ నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి జరిమానాలు విధించారు. అటవీ భూముల కందకాలను పూడ్చిన వారిపైనా చర్యలు తీసుకున్నారు. అనంతగిరి అటవీ ప్రాంతంతో పాటు బషీరాబాద్‌, యాలాల్‌, కులకచర్ల, దోమ, పూడూరు తదితర మండలాల్లో అటవీ భూములు ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించారు. అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రిసార్ట్స్‌ విషయంలోనూ కఠినంగా వ్యవహరించారు. అటవీ భూముల పరిరక్షణకు నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న డీఎఫ్ఓపై ముఖ్య నేతల ఒత్తిళ్లు వచ్చినా చట్టపరంగా ముందుకు సాగారు.

నిజానికి ఆయన వికారాబాద్ మండల పరిధిలో ఉన్న ఫారెస్ట్ భూమిలో అక్రమంగా నడుస్తున్న రెండు క్రషర్ మిషన్లను సీజ్ చేశారు. తాండూర్, ఆత్కూర్ దగ్గర ఉన్న మరో క్రషర్ మిషన్ ను సీజ్ చేశారు. దీంతో పాటు అనంతగిరి ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్ లో రెండు ఎకరాల ఫారెస్ట్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలోని సంఘయపల్లి దగ్గర ఏకంగా 100 ఎకరాల ఫారెస్ట్ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ట్రైల్స్ లో 6 ఎకరాల ఫారెస్ట్ భూమి కబ్జాకు గురైందని గుర్తించి నోటీసులు కూడా ఇచ్చారు. జిల్లాలోని అనేక చోట్ల ఫారెస్ట్ భూమిని గుర్తించి నోటీసులు ఇవ్వడంతో డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డి జిల్లాలో నిజాయితీ గల అధికారిగా చర్చనీయాంశం అయ్యారు. దీంతో జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు మరియు అధికార పార్టీకి చెందిన బడా నేతలు డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డిపై రాతపూర్వకంగా ఫిర్యాదులు చేయడమే కాక, అతడిని వెంటనే టాన్స్ ఫర్ చేయాలని ఒత్తిడి చేయడంతోనే చివరికి డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డిని టాన్స్ ఫర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారని సమాచారం. ఇది ఇలా ఉంటే విధులు నిర్వహించింది కేవలం 6 నెలలు అయినప్పటికీ కబ్జాదారులపై సింహ స్వప్నంలా విరుచుకపడ్డ డీఎఫ్ఓ వెంకటేశ్వర్ రెడ్డిపై జిల్లా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.