కోతుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : : అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

  • హరితహారం ప్రపంచానికే ఆదర్శం

హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రంలో చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తు తరాలకు ఓ వరమని చెప్పారు. హరితహారం, పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. హరితహారం కార్యక్రమం ద్వారా 2022-23లో 19.29 కోట్ల మొకలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకోగా, 2023-2024లో 20.02 కోట్ల మొకలు లక్ష్యంగా నిర్దేశించినట్టు వివరించారు. నాటిన మొకల్లో 85 శాతం మొకలను కచ్చితంగా కాపాడటం, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో మొకల పెంపకానికి 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయించడం, వాటికి నీరు పట్టేందుకు ట్రాక్టర్లను సమకూర్చడం లాంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. హరితహారం కార్యక్రమం ద్వారా 2015 నుంచి 2021 సంవత్సరాల మధ్య తెలంగాణలో 7.70 శాతం పచ్చదనం (గ్రీన్‌ కవర్‌) పెరిగినట్టు ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) ప్రకటించిందని గుర్తుచేశారు. ఫలితంగా తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్‌కు ట్రీ సిటీ ఆఫ్‌ వరల్డ్‌, వరల్డ్‌ గ్రీన్‌ సిటీ అవార్డులు వచ్చాయని మంత్రి గుర్తుచేశారు.

నిర్మల్‌లో కోతుల కేంద్రం

రాష్ట్రంలో కోతుల బెడదను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కోతుల వల్ల ఇప్పటి వరకు 72,133 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించామని తెలిపారు. కోతుల నియంత్రణకు ఇప్పటికే నిర్మల్‌లో ప్రయోగాత్మకంగా పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామని చెప్పారు. కోతుల బెడదను నివారించేందుకు 2023-24లో రూ.1.88 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించామని తెలిపారు. అడవి పందులు, ఇతర మృగాలతోపాటు కోతుల వల్ల పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇస్తున్నామని వెల్లడించారు. కోతుల దాడిలో గాయపడితే ప్రత్యేక వైద్యం అందించేందుకు దవాఖానల్లో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటికే అగ్రికల్చర్‌, అటవీ శాఖల సమన్వయంతో కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.