ఎర్రగడ్డలోని రాజ్‌ మినరల్‌ వర్క్స్‌ గోదాములో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎర్రగడ్డలోని రాజ్‌ మినరల్‌ వర్క్స్‌ గోదాములో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్‌ మొత్తం వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా, అగ్నిప్రమాదం జరిగిన గోదాము చుట్టూ మరికొన్ని గోడౌన్లు ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. మంటలను ఇతర గోదాములకు వ్యాపించకుండా చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.