ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఫార్మా పడగ

  • కొవిడ్‌ సమయంలో అనుమతి పొందిన 20 కంపెనీలు
  • చౌకగా భూములు, నిబంధనలు సరళించడమే కారణం
  • మునుగోడు నియోజకవర్గంలో మొదలైన ప్రజాందోళనలు

చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు ఇంకేముంది బడా ఫార్మా కంపెనీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కన్నేశాయి. కరోనా సమయంలో ప్రజాభిప్రాయం అవసరం లేదన్న సాకుతో ఒక్క మునుగోడు నియోజకవర్గంలో ఏకంగా 20 కంపెనీలు అనుమతులు పొందాయి. ఇప్పటికే రెండు కంపెనీలు పని ప్రారంభించగా ప్రజల ఆందోళనతో అవి నిలిచిపోయాయి. అన్ని అనుమతులు పొందిన ఆ కంపెనీలను ఎంతో కాలం ఆపలేమని జిల్లా ఉన్నతాధికారులు అనధికారికంగా చెబుతున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో ఫార్మా కంపెనీలు ఇక్కడ పాగా వేయడం ఖాయం. అదే జరిగితే పచ్చని పల్లెలు కాలుష్య కోరల్లో చిక్కుకోనున్నాయి. ఇప్పటికే చౌటుప్పల్‌ మండలంలోని పలు గ్రామాల్లో బోర్లు వేస్తే రంగునీళ్లు వస్తున్నాయి. స్థానికేతరులు ఎవ్వరూ ఇక్కడ నివసించేందుకు సాహసించడం లేదు.

కొవిడ్‌ మహమ్మారి ప్రబలిన సమయంలో కంపెనీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించింది. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రజాభిప్రాయసేకరణ అవసరం లేదని ఆ సమయంలో వెసులుబాటు కల్పించింది. దీంతో సుమారు 20 కంపెనీలు ఒక్క మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్‌, చండూరు, మునుగోడు, నారాయణపురం మండలాల్లో ఏర్పాటుచేసేందుకు అనుమతులు సాధించాయి. గట్టుప్పల్‌లో క్రాంతి ఫార్మా పనులు కూడా ప్రారంభించింది. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఏర్పడే దుష్పరిణామాలపై అవగాహన ఉన్న స్థానికులు, వామపక్ష నేతలు ఉప ఎన్నిక సమయంలో వరుస ఆందోళనలు చేశారు. ప్రజాందోళనతో దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం గట్టుప్పల్‌లో ఫార్మా కంపెనీ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. అయితే తమ కంపెనీకి అన్ని అనుమతులు ఉన్నాయని ప్రభుత్వ ఆదేశాలపై యాజమాన్యం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. తాజాగా మునుగోడు మండలం కిష్టాపురంలో సన్‌ఫార్మా కంపెనీ పనులు ప్రారంభించింది.

చౌకగా భూములు, సులభంగా నిబంధనలే కారణం

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మా సెజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం సుమారు 25వేల ఎకరాల్లో ఏర్పాటు చేసింది. ఆ సెజ్‌లో కంపెనీ ఏర్పాటుకు నిబంధనలు కఠినంగా ఉండటంతో నల్లగొండ, యాదాద్రి జిల్లాలపై ఫార్మా కంపెనీలు కన్నేశాయి. ఈ జిల్లాల్లో ఎకరం రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ఉండటం, రాత్రి వేళల్లో కెమికల్‌ వ్యర్థాలను పారవేసేందుకు ఖాళీ ప్రాంతాలు ఉండటం, నీటి లభ్యత వంటి కారణాలతో ఫార్మా కంపెనీలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వైపు కదిలాయి.

ప్రమాదపు అంచున పచ్చని పొలాలు

ఫ్లోరైడ్‌ మహమ్మారిపై దశాబ్దాలపాటు పోరాటం చేసిన మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ ప్రాంతానికి సురక్షిత తాగునీరు ఇప్పటికే అందుబాటులోకి రాగా, డిండి ఎత్తిపోతల, బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతలతో సాగుభూమి అందుబాటులోకి వస్తుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు. అందుకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఫార్మా కంపెనీ ప్రారంభమైతే కెమికల్‌ వ్యర్థాలను బోర్లు వేసి భూమిలోకి ఇంకిస్తారు. ఫలితంగా చుట్టుపక్కల ఉన్న భూములు కలుషి తం అవుతాయి. తొలుత రెండు నుంచి ఐదెకరా ల్లో ఫార్మా కంపెనీలు ప్రారంభించి, ఆ తరువాత క్రమంగా ప్లాంట్ల విస్తరణ చేపడతా యి. ఫార్మా కంపెనీల పక్కనున్న రైతు లు భూములకు ధరలు తగ్గడం, కంపెనీ పక్కన జల, వాయు కాలుష్యంతో పంటలు పం డించలేక క్రమంగా రైతులు పంట భూములను విక్రయించడం సర్వసాధారణంగా జరిగే అంశం. కొత్తగా అనుమతి పొందిన 20 ఫార్మా కంపెనీలు డిండి ఎత్తిపోతల పథకం పరిధిలోని కిష్టాపురం, శివన్నగూడెం బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్డు ఎడమ కాల్వ పరిధిలో నిర్మించనున్నాయి. దీంతో ప్రాజెక్టుల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మునుగోడు మండలం కిష్టాపురం పెద్దవాగు ద్వారా చెరువులోకి గతంలో దివీస్‌ కంపెనీ వ్యర్థా లు విడిచిపెట్టడంతో చేపలు మృత్యువాత పడిన ఘటన నాడు సంచలనంగా మారింది. వరదల సమయంలో కాల్వలు, చెరువుల్లో ఫార్మా కంపెనీలు వ్యర్థాలను విడిచిపెడుతూ ఇప్పటికే వివాదాలకు కారణమవుతున్నారు.

చేతులెత్తేసిన అధికారగణం?

కొవిడ్‌ సమయంలో అనుమతులు పొందిన కంపెనీలను నిలిపేందుకు ఉన్నతాధికారులు జంకుతున్నారు. ప్రభుత్వం పూర్తి అనుమతులు ఇవ్వగా, అడ్డుకునే అధికారం తమకు ఏ మేరకు ఉంది, అడ్డుకుంటే ఆయా కంపెనీలు కోర్టులను ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటనే సంశయంలో ఉన్నారు.

అనుమతులపై పరిశీలిస్తున్నాం : వినయ్‌ కృష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌

ప్రజల విజ్ఞప్తులు, ప్రభుత్వ ఆదేశం మేరకు ఇప్పటికే గట్టుప్పల్‌లో ఒక ఫార్మా కంపెనీ పనులను నిలిపేయాలని ఆదేశించాం. మునుగోడు మండ లం కిష్టాపురంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ అంశంపైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఫార్మా కంపెనీలకు అనుమతులు, నిలిపివేతకు ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నాం.

రసాయన పరిశ్రమలపై భారీ ఉద్యమం : నెల్లికంటి సత్యం, సీపీఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి

గాలి, నీరు, భూమిని కలుషితం చేసే అత్యంత ప్రమాదకర కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దు. కిష్టాపురంలో కంపెనీ ఏర్పాటుపై ఇటీవల మునుగోడు, చిట్యాల, నారాయణపురం మండలాల నుంచి అఖిలపక్ష బృందం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించాం. ఫార్మా కంపెనీలు ఇచ్చే డబ్బుకు ఆశపడి పాలకులు, కాలుష్యనియంత్రణ మండలి అధికారులు ఎలాంటి సర్వే చేయకుండా ఇష్టారీతిన అనుమతులు ఇచ్చారు. ఫార్మా కంపెనీలతో భూగర్భ జలాలు కలుషితమై భూమి నుంచి వచ్చే నీరు ఎరుపు రంగుకు మారుతోంది. ప్రజలు చర్మ, శ్వాసకోశ, క్యాన్సర్‌ వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని అఖిలపక్షంతో జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి దృష్టికి త్వరలో తీసుకెళ్లి భారీ ప్రజాందోళనకు శ్రీకారం చుడతాం. (సోర్స్: ABNఆంధ్రజ్యోతి)