యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలి

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు తక్షణమే పర్యావరణ అనుమతులు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, దివికొండ దామోదర్‌రావు ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి తన్మయికుమార్‌కు విజ్ఞప్తి చేశారు. రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంలో 64.20శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ దూర దృష్టితో శరవేగంగా పనులు పూర్తి చేయిస్తున్నారని వివరించారు. మొత్తం రూ.29,965 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్‌ లోటు ఉండదన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.