హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అయ్యారు. సాత్విక్ ఆత్మహత్య పట్ల కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు వెంకటరెడ్డి స్వయంగా శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు. కాలేజీ లోపలికి వెళ్లకుండా తనను అడ్డుకున్న సిబ్బందిపై మండిపడ్డారు. అనంతరం కాలేజీ ఆవరణలో దీక్ష చేపట్టారు. కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.
ర్యాంకుల పేరుతో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సాత్విక్ సూసైడ్ నోటులో పేర్కొన్న నలుగురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన నలుగుర్ని అరెస్ట్ చేసే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. సాత్విక్ ఘటనపై కాలేజీ యాజమాన్యం వివరణ ఇవ్వాలని కోరారు. సమాచారం అందుకున్న ఏసీపీ రమణగౌడ్ చైతన్య కాలేజ్ వద్దకు చేరుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చలు జరిపారు. ఆందోళన చేయవద్దని.. సాత్విక్ కేసుపై విచారణ జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.