- ఫ్యాక్టరీ ఎదుట వంటావార్పు నిర్వహించిన నిర్వాసితులు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్నఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలని వివిధ గ్రామాలకు చెందిన నిర్వాసితులు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ ముందు వంటావార్పు నిర్వహించారు. ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని గత రెండు, మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే జూరాల ఆర్గానిక్ ఫార్మా ఇండస్ట్రియల్ వారు చిత్తనూరు శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. మూడు పంటలు పండే భూములలో ఈ కంపెనీ ఏర్పాటు చేయడాన్ని చుట్టుపక్కల గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల సుమారు 53 గ్రామాల్లో గాలి, భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరితంగా వాళ్ళు అబద్దాలు చెప్పి చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్ పూర్ గ్రామాలకు చాలా దగ్గరలో జనావాసాల మధ్య ఈ కంపెనీ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు.
వారు తొలుత నేరేడు పండ్ల తోటలు పెడతామని చెప్పారని గ్రామస్తులు అంటున్నారు. కొద్ది రోజులలోనే ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని నిజం బయటపడిందని అన్నారు. ఉత్పత్తి క్రమంలో ఏం జరుగుతుంది, యాజమాన్యానికి కలిగే ప్రయోజనం ఏంటని ప్రజలకు, ప్రకృతికి జరిగే నష్టాలేంటి వంటి ప్రశ్నలు మేధావులు, పర్యావరణ వేత్తలు, వివధ గ్రామాల ప్రజలు లేవనెత్తుతున్నారు. గ్రామ యువ రైతాంగం ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది. మొత్తం మీదట ఇథనాల్ కెమికల్ కంపెనీని వ్యతిరేకిస్తున్నామని కంపెనీని రద్దు చేసేంత వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతామని వారు ముక్తకంఠంతో అంటున్నారు. వంటావార్పు కార్యక్రమంలో చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్ పూర్ తదితర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరికి మద్దతుగా పలువురు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు నిర్వహించిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఎలా అడ్డుకోవాలనే దానిపై ప్రత్యేకంగా చర్చ నిర్వహించారు.