హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 25 శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపురం–దిల్సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్ కూడలి వద్ద నిర్మించిన ఈ ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలు జరుగనున్నాయి.ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణం మరింత సులువుగా మారనుంది.
రూ.32 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ నుండి ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నుండి హయత్ నగర్ మీదుగా వచ్చే ప్రజలకు ఎంతగానో దోహద పడుతుంది. 700 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు గల ఈ ఫ్లై ఓవర్ వలన వాహన వేగం కూడా పెరుగనున్నది. ఎల్బీ నగర్ జంక్షన్ వద్ద ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 47 పనులలో, ఇప్పటివరకు 35 పనులు పూర్తి కాగా.. వాటిలో ఎల్బీనగర్ ఫ్లైఓవర్ 19వది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఫ్లైఓవర్లను నిర్మిస్తూ రవాణాను సులభతరం చేస్తుంది. ఇప్పటికే సిటీలో అనేక ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి.