రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. బిఆర్ కెఆర్ భవన్ నుండి వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మిగిలిన లబ్ధిదారులందరికీ ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 7 .31 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా, వీరిలో ఇప్పటికే 3.93 లక్షల మంది కి ఈ పధకం వర్తింప చేశామని వెల్లడించారు. మిగిలిన 3 .38 లక్షల మందికి గొర్రెలను పంపిణి చేయాల్సి ఉందని తెలిపారు. 2017 లో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 7 .31 లక్షల మంది అర్హులను గుర్తించడం జరిగింది. ఈ జాబితాను తిరిగి పరిశీలించి ఎవరైనా మరణించిన పక్షంలో వారి స్థానంలో వారి నామినీ ని మాత్రమే చేర్పించాలని కలెక్టర్లకు తెలిపారు.
ఈసారి గొర్రెల కొనుగోలు పూర్తిగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో గొర్రెలు అందుబాటులో ఉండే మార్కెట్లను పశు సంవర్ధక శాఖ గుర్తించిందని, జిల్లా స్థాయి సీనియర్ అధికారులను ఈ ప్రాంతాలకు పంపి కొనుగోలు చేయించాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన గొర్రెల రవాణాకి ట్రాన్స్పోర్ట్ టెండర్లను వెంటనే నిర్వహించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ అధికారులను కేవలం ఇన్సూరెన్స్, జీవాల ఆరోగ్యపరిస్థితి తదితర విషయాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. గొర్రెల కొనుగోలు కు లబ్ధిదారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు వెళ్తారని చెప్పారు.
గొర్రెల యూనిట్ ధరను లక్షా ఇరవై వేల నుండి లక్షా డెబ్భై అయిదు వేలకు పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీనివాసయాదవ్ గుర్తుచేశారు. గొర్రెల యూనిట్స్ లు కావాల్సిన లబ్దిదారులనుండి డీడీ లను కట్టియ్యడంతోపాటు ఈ పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియచేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధార్ సిన్హా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.