విధుల్లో మరణిస్తే రూ. కోటి .. ఫారెస్ట్‌ అధికారులకు భారీ నష్టపరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

 ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల చేతుల్లో కొన్ని సార్లు మృత్యువాత పడుతున్నారు. కొంత మంది చావును తప్పించుకోగలిగినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా విధులకు దూరమవుతున్నారు. ఇలాంటి వారిని, వారి కుటుంబాలను ఆదుకోవటానికి కేసీఆర్‌ ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకున్నది. విధి నిర్వహణలో భాగంగా తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల చేతిలో హతమైన అటవీశాఖాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టపరిహారాన్ని ప్రకటించింది. హోదాల వారీగా అధికారులకు రూ. 30 లక్షల నుంచి రూ. కోటి దాకా నష్టపరిహారాన్ని అందించనున్నది.

ఈ మేరకు తాజా గా జీవో విడుదల చేసింది. క్యాటగిరీల వారీ గా నష్టపరిహారాన్ని నిర్ణయించింది. బీట్‌ ఆఫీసర్‌ తత్సమాన హోదా గల ఉద్యోగులు అటవీ సంరక్షణలో భాగంగా సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే రూ. 30 లక్షలు, శాశ్వతంగా పనికి దూరమైతే రూ. 20 లక్ష లు, తీవ్రంగా గాయపడితే రూ. 3 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ స్థాయి వాళ్లు మరణిస్తే రూ. 45 లక్షలు, శాశ్వతంగా పనికి దూరమయ్యే పక్షంలో రూ. 25 లక్షలు, తీవ్ర గాయాల పాలైతే రూ. 5 లక్షలు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు మృత్యువాత పడితే రూ. 50 లక్షలు, శాశ్వతంగా పనిచేయలేని స్థితిలో ఉంటే రూ. 30 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షలు. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ స్థాయి ఉద్యోగులు మరణిస్తే రూ. 75 లక్షలు, శాశ్వతంగా విధులకు దూరమైతే రూ. 40 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 5 లక్షలు, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు విధి నిర్వహణలో భాగంగా దాడులకు గురై మరణిస్తే రూ. కోటి, పనిచేయలేని విధంగా గాయపడితే రూ. 50 లక్షలు, తీవ్ర గాయాలపాలైతే రూ. 6 లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు ఈ మొత్తాన్ని అందించనున్నది.