పర్యావరణానికి నష్టం లేకుండా ప్రాజెక్టులకు అటవీ అనుమతులు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణం, వన్యప్రాణులకు, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వన్య ప్రాణి మండలి సమావేశం వైస్ చైర్మన్ హోదాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రైల్వే, జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం-విస్తరణ, కవ్వాల్ పరిధిలో గ్రామాల తరలింపు తదితర అంశాల్లో అటవీ అనుమతులకు సంబంధించిన చర్చ సమావేశంలో సుదీర్ఘంగా జరిగింది. వివిధ ప్రతిపాదనలకు మండలి ఆమోదం తెలిపింది. వీటిని కేంద్ర వన్యప్రాణి మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆయా ప్రాజెక్టులు, అటవీ భూముల వినియోగంపై తొలుత అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అటవీ ప్రాంతాల్లో పనులు చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అటవీ శాఖ పెట్టిన నిబంధనలు, నియమాలను తప్పకుండా పాటించాలని పీసీసీఎఫ్ తెలిపారు. అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే అటవీ భూముల వాడకం జరగాలని, ఏ మాత్రం అతిక్రమించినా అటవీ చట్టాల మేరకు కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని అత్యవసరంగా జరగాల్సిన రోడ్ల మరమ్మత్తులకు కూడా వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. ఇక రక్షిత అటవీ ప్రాంతాల్లో నిర్మాణం జరిగే రైల్వే, రహదారుల ప్రాజెక్టుల వద్ద కచ్చితంగా వేగ నియంత్రణ పాటించటం, తగిన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేయటం, వెడల్పాటి అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. మండలిలో సభ్యులైన వణ్యప్రాణి నిపుణుల అనుమానాలను యూజర్ ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, అసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, వన్యప్రాణుల సంక్షేమ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణహిత నిపుణులు, మండలికి నామినేట్ అయిన ఇతర సభ్యలు పాల్గొన్నారు.