- కాలుష్య నియంత్రణ మండలి నిరుపయోగంగా మారింది
- మూసివేతకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం
- న్యాయాధికారితో నిర్వహణకు ఆదేశిస్తాం
- ప్రజల విజ్ఞప్తులపై ఎందుకు స్పందించట్లేదు
- స్పందించని అధికారికి ఫైన్ వేయండి
- విజ్ఞప్తులను పరిష్కరించనివారు జీతాలు తీసుకునేందుకు అనర్హులు
- ఇలాగైతే చైర్మన్ ను హాజరవ్వాలని ఆదేశిస్తాం
- హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
- మైహోం ఇండస్ట్రీ విషయంలో నోటీసులు
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్ పిసిబి)పై హైకోర్టు సీరియస్ అయ్యింది. పీసీబీ నిరుపయోగంగా మారిందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. “పీసీబీ పౌరుల సమస్యలను పట్టించుకోకుండా ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో ప్రభుత్వం తర్వాత పీసీబీకి సంబంధించిన కేసులే ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు పీసీబీకి ఇచ్చే విజ్ఞప్తులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల వారు హైకోర్టుకు వస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పీసీబీని మూసేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. లేదంటే జ్యుడీషియల్ ఆఫీసర్ ద్వారా నిర్వహణ చేపట్టాలని ఆదేశిస్తాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి నిర్దిష్టమైన కాలవ్యవధి ఉండాలని.. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత అధికారికి జరిమానా విధించాలని సూచించింది. ఈ సమస్యలపై వివరణ ఇచ్చేందుకు పీసీబీ చైర్మన్ వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని వ్యాఖ్యానించింది. సూర్యాపేట జిల్లాలో మైహోం ఇండస్ట్రీ విస్తరణ అనుమతుల్లో భాగంగా పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులిచ్చింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ మేళ్ల చెరువుకు చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలను వినిపిస్తూ మైహోం సంస్థ ఉత్పత్తి సామర్ధ్యం పెంపు, సిమెంట్, సున్నపురాయి లీజులకు సంబంధించి మూడు వేర్వేరు దరఖాస్తులు చేసుకుందని వివరించారు. ఒకేరోజు మూడు వేర్వేరు సమయాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నోటీసులు ఇవ్వడం ఆక్రమమని పేర్కొన్నారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. “వేర్వేరు దరఖాస్తులపై ఒకేరోజు వేర్వేరు సమయాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో లేదు. ఒకే సమయంలో ఒకదాని తర్వాత ఒక అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి. ఈ మేరకు గ్రామాల్లో దండోరా వేయించండి. ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరించాలి. ఏయే ఆభ్యంతరాలు వచ్చేయో పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయండి” అని సూచించింది. పీసీబీ ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ ఈ సందర్భంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పీసీబీ, హైహోం సంస్థకు నోట్ సులు జారీచేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. (సోర్స్ : ఆంధ్రజ్యోతి)