- ఎనిమిది మంది కార్మికులకు తీవ్ర గాయాలు
- మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది.
- బాధితులంతా బిహార్ వాసులే
కొందుర్గు దగ్గర స్కాన్ ఎనర్జీ (ఐరన్) పరిశ్రమలో మంగళవారం చోటు చేసుకున్న భారీ పేలుడులో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మండుతున్న బట్టి అనుకోకుండా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని జ్వాలలు ఎగిసిపడి పక్కనే ఉన్న రెండు లారీలపై పడటంతో పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో వాహనం పాక్షికంగా కాలిపోయింది. ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంలో గాయపడ్డ వారు బిహార్ కు చెందిన రాజీవ్ యాదవ్, రాజ్ నారాయణ్, లాల్ బాబు, మహిమూద్ తదితరులు షాద్ నగర్ పట్టణంలోని శివరామ్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన నలుగురిని దివ్య ఆస్పత్రిలో చేర్పించినట్లు సమాచారం. కొందుర్గు ఎస్ఐ కృష్ణయ్య సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో చాలా మంది కార్మికులకు గాయాలై ఉంటాయని, విషయం బయటకు పొక్కకుండా యాజమాన్యం జాగ్రత్త పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.