ముందు తరాల వారికి కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం : పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య
పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, ముందు తరాల వారికి కాలుష్య రహిత సమాజాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ కృష్ణ ఆదిత్య అన్నారు. సనత్ నగర్ లోని ప్రధాన కార్యాలయంలో మట్టితో తయారు చేసిన గణనాధుని, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించారు. మంగళవారం మెంబర్ సెక్రెటరీ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను కోరారు. రంగు రంగుల రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, నిమజ్జనం రోజు చెరువులోని నీరు కాలుష్యం అవుతుందని వెల్లడించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం కార్యక్రమం చేయాలని ఉద్యోగులకు మెంబర్ సెక్రెటరీ సూచించారు. కార్యక్రమంలో పిసిబి చీఫ్ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ రఘు, సీనియర్ సోషల్ సైంటిస్ట్ ప్రసన్నకుమార్, ఎస్ఈఎస్ డాక్టర్ ప్రసాద్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సి. మధుసూదన్ గౌడ్, జనరల్ సెక్రెటరీ ఆర్. నవీన్ కుమార్ గౌడ్, మూర్తివెంకట్రావు, రాజా రమేష్, సునీల్, దయా నంద్, ఉబేద్ తదితరులు పాల్గొన్నారు.