కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దళారీ రాజ్యమే.. : సీఎం కేసీఆర్‌

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధరణి తీసివేస్తమని రాహుల్‌ గాంధీకి కూడా మాట్లాడుతున్నడు. రాహుల్‌ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసరం ఎరుకనా? ఎన్నడన్న నాగలి పట్టిండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు. ధరణి బంద్‌ అయితే.. దానికి ప్రత్యామ్నాయం ఏం వస్తుంది? మళ్లీ వీఆర్వోలేనా ? మళ్లీ పహాణీ నకల్లేనా? మళ్లీ ఎమ్మార్వో కార్యాలయం.. వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుడేనా? అన్న నా పేరు ఎక్కియ్యంటే.. మళ్లీ లావ్‌ పాంచ్‌ హజార్‌ అంటారు. మళ్లీ అదే రావాలా? మీ అధికారం ఉండాలా? మీ అధికారాన్ని తీసివేసుకుంటారా..? అంటూ ప్రశ్నించారు.

‘మీ ఓటు అంటే మామూలు విషయం కాదు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. పైరవీకారుల చుట్టూ తిప్పే రాజ్యం వస్తుంది. భూమిపై పెత్తనం ప్రభుత్వానికి వెళ్తుంది. బీఆర్‌ఎస్‌కు, సండ్ర వెంకటవీరయ్యకు ఓటు వేస్తే మీ భూమిపై పెత్తనం ఉండాలా? పోవన్నా..? ఎక్కడ మారుమూల పల్లెలో అడిగితే ధరణి ఉండాలని చెబుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు.. కేసీఆర్‌ ప్రజలు కట్టే అమూల్యమైన పన్నుల డబ్బులను రైతుబంధు అని రైతులకు పంచి దుబార చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు ఉండాలా వద్దా? మరి దుబారా అనేటాయనను ఏం చేయాలి? దాని అర్థమేంది. కాంగ్రెస్‌ మీకు హింట్‌ వస్తుంది. గొడ్డలి భుజం మీదున్నది. బట్టకప్పారు గంతే.. ఒక్క దెబ్బతో కాంగ్రెస్‌ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్‌.. కరెంటు కాటకలుస్తుంది’ అంటూ హెచ్చరించారు.

‘మళ్లీ రెవెన్యూ రికార్డులు, వకీళ్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్లు ఓపెన్‌గా చెబుతున్నారు. వాళ్లు అంతచెప్పంగా ఓటు వేస్తామంటే నేను చేయగలిగేది ఏం లేదు. మీ ఇష్టం. మీరే ఆలోచన చేయాలి. ఆ ప్రమాదం కొనితెచ్చుకుందామా? దుష్ట దుర్మార్గ కాంగ్రెస్‌ను తెచ్చుకొని పైరవీకారుల రాజ్యాన్ని తెచ్చుకొని మన భూములపై పెత్తనాన్ని పోగొట్టుకుందామా? ఆలోచన చేయాల్సింది మీరు. గ్రామాలకు వెళ్లిన తర్వాత కేసీఆర్‌ ఇలా చెప్పిండు.. ఇది నిజమా? అబద్ధామా? అని ప్రతి ఒక్కరితో చర్చ చేయాలి. అప్పుడు ప్రజాస్వామ్యంలో పరిపుష్ఠి. అప్పుడు విజయం వస్తుంది.. గెలుస్తాం. వెంసూర్‌ మండలానికి నేను వచ్చాను. ఒకప్పుడు రైతులు ఘోరంగా ఏడ్చేది’ అంటూ గుర్తు చేశారు సీఎం కేసీఆర్‌.

‘అదే మండలంలో పుట్టిన మన ఖమ్మం జిల్లా పార్థసారథిరెడ్డి చాలా పాఠశాలలు, జూనియర్‌ కళాశాల, లైబ్రరీ కట్టించారు. ఎంతో మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. తాను సంపాదించుకున్నా పేరు ప్రతిష్ఠలు వచ్చినా తన కన్న భూమిని, మాతృభూమిని వదిలిపెట్టకుండా ప్రేమతో పార్థసారథిరెడ్డి పని చేస్తున్నారు. నేను వచ్చిన రోజు వేంసూర్‌ లిఫ్టుల వద్ద ఏడ్చారు. సార్‌ కాలువ నాలుగు మామిడి చెట్లు ఉన్నయ్‌.. సాగర్‌ కాలువ నుంచి నీళ్లు తీసుకుంటే.. మోటార్లు కోసి కాలువలో పడేస్తున్నరు బెదిరించి వెళ్లండి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులు నింపుకుంటున్నాం. సండ్ర వెంకటవీరయ్య నాతో పోరాడి.. కాలువలు తవ్వించారు. చెరువు నింపడంతో వెంసూర్‌ మండలం కూడా పచ్చబడ్డది’ అన్నారు.