సువెన్ ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ షురూ…

  • జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు..
  • ఫార్మ కంపెనీలో అగ్ని ప్రమాదంపై విచారణ, పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆదేశాలు..
  • ప్రమాదంపై పోలీస్, ఇంటలిజెన్స్ ఆరా.!
  • ఫార్మా కంపెనీపై తండా ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లువ..
  • ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత అధికారులకు సమాచారం ఇచ్చిన ఫార్మా యాజమాన్యం..

సువెన్ ఫార్మాలో తప్పిన పెను ప్రమాదం అనే వార్త కథనానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఫార్మా కంపెనీలో విచారణ చేపట్టగా, జిల్లా ప్రజల నుంచి కూడా కంపెనీపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. సువెన్ ఫార్మా కంపెనీలో శనివారం ఉదయం 11 గంటల తరువాత జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై లోతైన విచారణ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇప్పటికే పోలీస్, రెవిన్యూ, మున్సిపల్, ఇంటెలిజెన్స్ అధికారులు కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీసినట్టు తెలుస్తుంది.

ఫార్మా కంపెనీలో ఫైర్ సేఫ్టీ పనిచేస్తుందా..?

సువెన్ ఫార్మా కంపెనీ స్థాపించి సుమారు 41 సంవత్సరాలు కావస్తుంది. అప్పట్లో పది ఎకరాల స్థలంలో కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభించిన సువేస్ ఫార్మా, ఇప్పుడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో, వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు సైతం పెడుతుంది. . ఇక్కడ ఏర్పాటు చేసిన చిన్న కంపెనీ తో, ఎంతో లాభం పొందిన ఫార్మా కంపెనీ యాజమాన్యం, గత కొన్ని సంవత్సరాలుగా “సెంట్రల్ ఫైర్ హైడ్రాయిడ్ సిస్టం” లేకుండానే కంపెనీ నడిపిస్తున్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇంత పెద్ద ఫార్మా కంపెనీలో సరైన సెంట్రల్ ఫైర్ హైడ్రాయిడ్ సిస్టం లేకపోవడం గమనార్హం. ఈ ఫార్మా కంపెనీకి ఎంతోమంది అధికారులు, నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే, ఎలాంటి ఫిర్యాదులు అందిన కంపెనీని విస్తరిస్తున్నారు తప్ప మూత పడడం లేదంటూ స్థానిక తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన, అధికారులకు సమాచారం లేదు..

సువెన్ ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ బోర్డు, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసిల్దార్, పోలీస్ శాఖల అధికారులకు ఫార్మా కంపెనీ యాజమాన్యం జరిగిన ప్రమాద సమాచారం తెలియపరచాల్సి ఉంటుంది. కానీ ఫార్మా కంపెనీ నిర్వాహకులు నిమ్మకు నీరుఎత్తినట్టుగా వ్యవహరిస్తూ, అధికారులు, స్థానిక నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ధీమాతో ఒక్క ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అధికారికి మాత్రమే ప్రమాదం జరిగిన మరుసటి రోజున సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. మిగతా ఏ అధికారి కూడా సమాచారం ఇవ్వలేదు. అగ్ని ప్రమాదం జరిగిన వారం రోజుల తర్వాత పత్రికలలో వచ్చిన కథనం చూసిన అధికారులు, కంపెనీ యాజమాన్యాన్ని అడగడం హాస్యాస్పదంగా ఉంది. ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ యాక్ట్ ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి. కానీ ఈ అధికారులు ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది.

విచారణకు ఆదేశించాం :

జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు.. సువెన్ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, పొల్యూషన్ బోర్డు అధికారులకు తెలియజేశాం. ఫార్మా కంపెనీలో పూర్తిస్థాయిలో విచారణ చేసి రిపోర్ట్ నిర్వాహకులకు నోటీసు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత కంపెనీలో ఎం జరిగింది అనేది వివరిస్తాం అన్నారు. ..(సోర్స్: ఆదాబ్ హైదరాబాద్)