ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. రాజధానిలో (national capital) తీవ్ర వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. నవంబర్‌ 9 నుంచి 18వ తేదీ వరకూ అన్ని పాఠశాలలకు ముందస్తు శీతాకాల సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యశాఖ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా ఢిల్లీలో పాఠశాలలకు శీతాకాల సెలవులు జనవరిలో ఇస్తుంటారు. అయితే, ఈ సారి తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ముందుగానే ప్రకటించారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తోంది. దీంతో నగరంలో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. పంజాబీ బాగ్‌లో గాలి నాణ్యత సూచీ (AQI) 460కి చేరింది. ఆనంద్‌ విహార్‌లో 452, ఆర్‌కేపురంలో 433గా నమోదైందని సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (CPCB) పేర్కొంది. ఢిల్లీ అంతటా గాలి నాణ్యత అధ్వానంగా కొనసాగుతోందని పేర్కొంది.

కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలోని గౌతమ్‌బుద్ధానగర్‌, ఘజియాబాద్‌లో ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం ఇప్పటికే మూసివేసింది. రాబోయే ఆరురోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వానస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని.. దాంతో కాలుష్యం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, నవంబర్‌ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది.