అవినీతి అధికారులు, క్రషర్ల యాజమాన్యల వల్లే రోడ్ల పాలయ్యాం..

  • క్రషర్ల యాజమాన్యలు, అవినీతి అధికారులే మా బతుకులను ఆగం చేశారు..
  • మాకు న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తాం..
  • పటాన్ చెరులో 100 నామినేషన్లు వేస్తాం..
  • ఎన్నికల ఖర్చుల కోసం బిచ్చమెత్తుకుంటున్నాం..
  • లకుడారం గ్రామస్తుల ఆందోళన..
  • రాజకీయ పార్టీల్లో కలవరం…
  • జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అవినీతి అధికారులు, క్రషర్ల వ్యవహారం..

పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు అవినీతికి అలవాటు పడి అడ్డగోలు పర్మిషన్లు ఇవ్వడం వల్ల ఆ అవినీతి అధికారుల పుణ్యమాని ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్న స్టోన్ క్రషర్లతో మా బతుకులు అగమవుతున్నాయని లకుడారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి, వీరేశం, శ్రీకాంత్, సారా రాజు, వేణుగోపాల్ చారి, చంద్రమ్మ, ఎర్రోళ్ల యాదమ్మలతో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. క్రషర్ల బారి నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలని సంకల్పంతో గ్రామంలోని 100 మంది ఎన్నికల రణరంగంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని నామినేషన్ల ఉద్యమం మొదలు పెడుతున్నామని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చుల కోసం ప్రజల నుంచే డబ్బు సేకరించే పనిలో గ్రామంలో బిచ్చమెత్తు కుంటున్నామన్నారు. ఖర్చుల నిమిత్తం గడపగడపకూ తిరుగుతూ గ్రామస్తులకు సమస్యను వివరిస్తూ భిక్షాటన చేశారు.

బడా నేతలు, అవినీతి అధికారుల వల్లే మా బతుకులు ఆగమయ్యాయి

క్రషర్ల నుంచి వెలువడే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో మా ఊరు ఆగమైపోతుందని వాపోయారు. క్రషర్లు గ్రామస్తులు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. క్రషర్లతో అన్నదాతలు పంటల సాగుకు దూరం అవుతుండగా, క్రషర్ల బాంబుల మోతలకు ఇండ్లు ధ్వంసమై ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. క్రషర్ల ద్వారా వ్యాపిస్తున్న దుమ్ము ధూళితో గ్రామంలో రైతులు పంటలకు స్వస్తి పలికే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వందలాది లారీలు తిరుగుతుండడంతో పెద్ద ఎత్తున దుమ్ము పంటలపై వ్యాపించడంతో పంటలు పండటం లేదని తెలిపారు. దానికి తోడు క్రషర్ల దుమ్ముతో గ్రామాల్లో ప్రజలు శ్వాశ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాలైన అనారోగ్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బడా నేతలు, పొల్యూషన్ కట్రోల్ బోర్డు అధికారులు, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చెవిన పెట్టలేదని వారి తీరు వల్లనే మా బతుకులు ఆగమయ్యాని చెప్పారు.

ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల అభిప్రాయలను పట్టించుకోవట్లేదు

క్రషర్ల కాలుష్యాన్ని నివారించాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఉన్న క్రషర్లతో తాము అవస్థలు పడుతున్నామని తెలిసిన అవినీతి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఉన్నవి సరిపోవన్నట్లు, భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటూ అడ్డ దారిలో కొత్త వాటికి అనుమతులు ఇస్తూ తమ గ్రామస్ధుల జీవితాలను అస్తవ్యస్తంగా మారుస్తున్నారని వాపోయారు. క్రషర్ల ఏర్పాటుకు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో తామంతా క్రషర్ల ఏర్పాటును వ్యతిరేకించిన మైనింగ్ డిపార్ట్ మెంట్, ఈసీ కమిటీ, పొల్యూషన్ కట్రోల్ బోర్డులోని కొంతమంది అవినీతి అధికారులు, కొంతమంది లీడర్లు మాత్రం యాజమాన్యానికి కొమ్ముకాస్తూ మా గ్రామాన్ని వల్లకడుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.

క్రషర్ల కట్టడిలో స్పష్టమైన హామీ ఇవ్వాలి

క్రషర్ల ద్వారా జరుగుతున్న జీవన విధ్వంసం ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అందుకే ఎన్నికల రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. గ్రామస్తులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ఎన్నికల్లో పోటీ చేసేంత ఆర్థిక వనరులు తమ వద్ద లేవని అందుకే తమ గ్రామంలో భిక్షాటన చేసి వచ్చిన డబ్బులను నామినేషన్లకు వినియోగిస్తామని తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తేనే తాము ఎన్నికల బరిలో నుంచి పక్కకు తప్పుకుంటామని తేల్చి చెప్పారు, అయితే నియోజకవర్గంలో ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. గ్రామస్తులు మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం 100 మందికి పైగా ఎన్నికల్లో బరిలో నిలిచి ఉంటామని గ్రామస్తులు ప్రకటించడంపై రాజకీయ పార్టీలలో కలవరం మొదలైంది. గ్రామస్తులు బరిలో ఉంటే కలిగే లాభనష్టాలపై పార్టీలు బేరీజు వేసుకుని గ్రామస్తులకు సర్ది చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల వేళ జరుగుతున్న ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే అన్నీ చోట్ల ఇలానే చేస్తే అధికార పార్టీకి తలనొప్పే అవుతుందని భావిస్తున్నారు. అవినీతి అధికారుల పుణ్యమాని ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కొందరు పర్యావరణ వేత్తలు, మేధావులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని శాంతి కుమారి, IAS, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), రజత్ కుమార్, IAS, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల & CAD శాఖ, Environment, Science & Tech. Dept. మిగతా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

సంగారెడ్డి PCB RO పరిధిలో జరుగుతున్న అవినీతి బాగోతాలపై త్వరలో పూర్తి ఆధారాలతో మరింత సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తుంది.. ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ మా నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం… అవినీతిపైనే మా పోరాటం…