ఏసీబీ వలలో విద్యుత్తు ఏడీఈ ఉదయ్‌కుమార్‌

  • ట్రాన్స్‌ఫార్మర్‌ అప్‌గ్రేడ్‌ కోసం 2 లక్షలు డిమాండ్‌
  • 50 వేలు తీసుకుంటూ ఆర్టిజన్‌ పట్టివేత

ట్రాన్స్‌ఫార్మర్‌ అప్‌గ్రేడ్‌ కోసం డబ్బులు తీసుకుంటూ కేపీహెచ్‌బీకాలనీ విద్యుత్తు ఏడీఈ, ఆర్టిజన్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ హరీశ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. కొండాపూర్‌ విద్యుత్‌ డివిజన్‌ పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీ విద్యుత్‌ సెక్షన్‌ కార్యాలయంలో ఏడీఈగా ఉదయ్‌కుమార్‌ విధులు నిర్వహిస్తున్నారు.

అదే కాలనీకి చెందిన ప్రవీణ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అప్‌గ్రేడ్‌ కోసం ఏడీఈని సంప్రదించాడు. అతను రూ.2 లక్షలు డిమాండ్‌ చేయగా, రూ.లక్ష ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో ప్రవీణ్‌ ఏసీబీ పోలీసులను ఆశ్రయించాడు. శుక్రవారం ఏడీఈని సంప్రదించగా, డబ్బులను ఆర్టిజన్‌ కోటిరెడ్డికి ఇవ్వాలని చెప్పాడు. రూ.50 వేల నగదు ఆర్టిజన్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడీఈ ఉదయ్‌కుమార్‌, ఆర్టిజన్‌ కోటిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొండాపూర్‌ డీఈ, ఇతర అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.