తెలంగాణ కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ..

 తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ నేతృత్వంలోని బృందం గెజిట్‌ను అందజేసింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సైతం గవర్నర్‌కు సీఈవో అందించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పడినటయ్యింది.

మంత్రివర్గ సిఫారసు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ రద్దు చేశారు. మరో వైపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. సీఎం ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగనున్నది. కాంగ్రెస్‌ బృందం సైతం గవర్నర్‌ను కలువనున్నది. కాంగ్రెస్ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీని సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఎమ్మెల్యేలతో సమావేశమైంది.

ఉదయం నుంచి సమావేశం జరుగుతుండగా.. సీఎల్పీ నాయకుడు ఎవరన్నది ఇంకా తేలలేదు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యేలు అప్పగించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. అయితే, ఎల్పీ సమావేశం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌ జరుగుతున్నది. హోటల్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. ఇందులో కీలక నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ ఉన్నారు. నలుగురు నేతలు సమావేశం నుంచి ఎందుకు బయటకు వెళ్లిపోయారన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.