ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ ప్రభాకర్‌ రావు రాజీనామా

తెలంగాణలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (SIB) లోగల యాంటీ నక్సల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి ప్రత్యేక అధికారి (OSD) గా ఉన్న మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ టీ ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు అయిన ప్రభాకర్‌ రావు మూడేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు.

కొంత కాలం క్రితం ఓఎస్‌డీ ప్రభాకర్‌ రావుపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను టాప్‌ చేస్తున్నారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్ర పరిణామాలను అనుభవిస్తావని ప్రభాకర్‌ రావును హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడంతో పదవికి రాజీనామా చేశారు.

ఇప్పటికే ట్రాన్స్‌ కో, జెన్‌ కో సీఎండీ డీ ప్రభాకర్‌ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి కూడా తన పదవి నుంచి వైదొలిగారు.