పేపర్‌ ప్లేట్ల కంపెనీలో అగ్ని ప్రమాదం

పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రామ్‌రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రం అధికారి సుభాష్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉన్న రామిరెడ్డినగర్‌లో బాలాజీ మార్కెటింగ్‌ కంపెనీలో పేపర్‌ ప్లేట్లను తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో యంత్రంలో షార్ట్‌ సర్క్యూట్‌ నెలకొని మంటలు చెలరేగాయి. కార్మికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చెరుకున్న ఫైర్‌స్టేషన్‌ సిబ్బంది ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పివేశారు. సుమారు లక్ష రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక కేంద్రం అధికారి సుభాష్‌రెడ్డి తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.