మోహదీపట్నం అంకుర ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

 హైదరాబాద్‌ నగర పరిధి మెహదీపట్నంలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక జ్యోతినగర్‌ ప్రాంతంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలోని పిల్లర్‌ నెంబర్‌ 68 దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఐదోఫ్లోర్‌ నుంచి పదో ఫ్లోర్‌ వరకు మంటలు అంటుకున్నాయి. పైనుంచి అగ్నికీలలు కిందపడుతున్నాయి. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లను వెంటనే బయటకు పంపారు. హాస్పిటల్‌ నేమ్‌ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. బోర్డు పక్కనే ఫ్లెక్సీలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంఘటనా స్థలంలో నాలుగు ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్‌ఎంసీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సంఘటనా స్థలానికి చేరుకొని సౌత్‌, ఈస్ట్‌జోన్‌ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో ఆసుపత్రి హోర్డింగ్‌లు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.