సింగరేణి సీఎండీగా బలరాం

 సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎన్‌ బలరాం నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ పదవీకాలం పూర్తికావడంతో జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి బదిలీ చేశారు. ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన బలరాం ఇప్పటి వరకు సింగరేణిలో ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని సీఎస్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మంగళవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించిన బలరాం అనంతరం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, సీఎస్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విద్యుత్తు కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని బలరాంను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్తును నిరంతరాయంగా అందిస్తామని తెలిపారు. సంక్షేమంలోనూ సింగరేణిని నంబర్‌ వన్‌ చేస్తానని చెప్పారు. ఒడిశాలోని నైనీబ్లాక్‌ నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని వివరించారు.