సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్‌ఎస్‌ అధికారి జీ చంద్రశేఖర్‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఐఎఫ్‌ఎస్‌ అధికారి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ జీ చంద్రశేఖర్‌ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో జాయింట్‌ ఐజీ వేముల శ్రీనివాసులును సీఎం కార్యాలయం ఓఎస్డీగా, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ శంకరయ్యను టీఎస్‌టీఎస్‌ ఎండీగా నియమించారు.

దేశంలోనే తొలి బీఎస్సీ ఫారెస్ట్రీ ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా గుర్తింపు ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ జీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా వాసి. బీఎస్సీ ఫారెస్ట్‌ గ్రాడ్యుయేట్‌గా ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో చేరిన దేశంలోని తొలివ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. బీఎస్సీ ఫారెస్ట్రీ ఉస్మానియాలో, ఎంఎస్సీ జేఎన్‌యూ న్యూఢిల్లీ, లైఫ్‌సైన్సెస్‌ ఐఐఎం బెంగళూరులో, పీజీపీపీఎం యూఎస్‌ఏ సిరక్యూస్‌లో పూర్తిచేశారు.

కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్‌ఆర్‌డీ) ఆధ్వర్యంలో ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు నిర్వహించిన ఫౌండేషన్‌ కోర్సులో 580 మంది అధికారులకు శిక్షణ ఇచ్చే కోర్సు డైరెక్టర్‌గా పనిచేశారు. చిత్తూరులో ఫారెస్ట్‌ డివిజన్‌ ఆఫీసర్‌గా, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌గా మహబూబ్‌నగర్‌లో, నీటి సంరక్షణ మిషన్‌ అడిషనల్‌ సీఈవోగా, హెచ్‌ఎండీఏ ఎన్విరాన్‌మెంట్‌ సభ్యుడిగా, హైదరాబాద్‌ సీసీఎఫ్‌గా, ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ హైదరాబాద్‌ వ్యవస్థాపక డీన్‌గా పనిచేశారు. ప్రపంచబ్యాంక్‌, జైకా, డీఎఫ్‌ఐడీ నుంచి ప్రాజెక్టులను చేపట్టిన అనుభవం ఉన్నది. తెలంగాణ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో మూడేండ్లుగా వైస్‌చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.