- కాంట్రాక్టర్‌ను డబ్బుల డిమాండ్
- రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
కామారెడ్డి జిల్లా కేద్రంలో అవినీతి నిరోధక శాఖ వలలో ట్రాన్స్ కో చేప చిక్కింది. కామారెడ్డి జిల్లా కేద్రంలోని 132/11 కెవి సబ్ స్టేషన్ లో ట్రాన్స్ కోకు సంబందించి వాహనాల అద్దె డబ్బుల బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి ట్రాన్స్‌కో ఏఈ రాజు ఏసీబీ వలకు సోమవారం చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భైరవస్వామి అనే వ్యక్తికి రెండు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలను ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌కు నడిపించేందుకు నెలకు ఒక్కో వాహనానికి రూ.61వేల అద్దెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ బిల్లులను ట్రాన్స్‌కో ఏఈ రాజు ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. మూడు బిల్లులకు రూ.12,500 డిమాండ్ చేయగా భైరవస్వామి ఏసీబీని ఆశ్రయించాడు.
పథకం ప్రకారం తాను అడిగిన డబ్బులను తన స్నేహితుడు సంతోష్ అనే వ్యక్తికి ఓ జిరాక్స్ సెంటర్‌లో ఇవ్వాలని భైరవస్వామికి ఏఈ రాజు సూచించాడు. సంతోష్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ రాజు, అతని స్నేహితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఆయన వెంట ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు నాగేశ్వర్, శ్రీనివాస్ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాల కోసం డిమాండ్ చేస్తూ వేధింపులకు గురి చేస్తే తమను సంప్రదించాలని ప్రజలను ఏసీబీ అధికారులు కోరారు.