ఏసీబీ వలలో అవినీతి చేపలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా కడెం తహసీల్దార్‌ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ. 15 వేలు తీసుకుంటూ కాసిపేట పీఆర్‌ ఏఈ పరంజ్యోతి, పంచాయతీ కార్యదర్శి వీరబాబు అడ్డంగా బుక్కయ్యారు.

భూమి పట్టా విషయంలో రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటూ కడెం రెవెన్యూ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన లసెట్టి రాజన్న పెద్దనాన్న పేరుమీద ఉన్న 35 గుంటల భూమి పట్టా విషయంలో రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారు. సర్వే నంబర్‌ 376లోని 5 గుంటలు, 373/2/2 లోని 24 గుంటలు, 376/2లోని 6 గుంటల భూమిని తన తమ్ముడు లసెట్టి సురేశ్‌ పేరిట గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు గత నెల 28న ధరణి ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు.

గిఫ్ట్‌ భూమిని పట్టా చేయడం సాధ్యం కాదని, మూడు సర్వే నంబర్లకు గానూ ఒక్కో దానికి రూ. 5 వేల చొప్పున మొత్తం రూ. 15 వేలు ఇవ్వాలని లంచం డిమాండ్‌ చేశారు. ఈ నెల 9 వరకు కూడా తహసీల్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాలేదు. దీంతో బాధిత రైతు ఈ నెల 9న కరీంనగర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఉదయం మళ్లీ పట్టా కోసం కడెం కార్యాలయానికి వెళ్లగా రూ. రూ. 9 వేలు ఇచ్చి పట్టా చేయించుకోమని అధికారులు చెప్పారు.

దీంతో రూ. 9 వేలు తహసీల్దార్‌ రాజేశ్వరి సూచన మేరకు డీటీ చిన్నయ్య కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకున్న నగదును స్వా ధీనం చేసుకొని తహసీల్దార్‌, డీటీని కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064, 91543 88963 సంప్రదించాలని ఆయన సూచించారు. ఏసీబీ ఎస్‌ఐలు జాన్‌రెడ్డి, రవీందర్‌, స్థానిక పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

బెల్లంపల్లిలో..

బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మ ధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెర్కపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ రామగోని అశోక్‌గౌడ్‌ నుంచి రూ 15 వేలు లంచం తీసుకుంటున్న కాసిపేట పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ పోగుల పరంజ్యోతి, పెర్కపల్లి పంచాయతీ కార్యదర్శి కవటం వీరబాబును రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 15 వేలను వారి వద్ద నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పెర్కపల్లిలో పూర్తి చేసిన తెలంగాణ క్రీడాప్రాంగణానికి సంబంధించిన రూ 1.50 లక్షల మట్టి ప నులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం మెజర్‌మెంట్‌ బుక్‌ చేయడానికి కాంట్రాక్టర్‌ నుంచి రూ.15వేలు లంచంగా డిమాండ్‌ చేశా రు. రెండేళ్లుగా బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించాడు. బుధవారం మధ్యాహ్నం బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాల యం వద్ద కాంట్రాక్టర్‌ అశోక్‌గౌడ్‌ నుంచి లం చం తీసుకుంటుండగా పంచాయతీరాజ్‌ ఏఈ పోగుల పరంజ్యోతి, పంచాయతీ కార్యదర్శి కవటం వీరబాబు అడ్డంగా దొరికిపోయారు.

వీరి పై అధికారులు కేసు నమోదు చేశారు. అధికారులు లంచం అడిగితే బాధితులు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)ను ఆశ్రయించాలని ఆదిలాబాద్‌ ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌ కోరారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064 కి కాల్‌ చేయాలని, వెంటనే ఏసీబీ అధికారులు సత్వర న్యాయం అందిస్తారని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు జే రాము,ఏ.తిరుపతి,సునీల్‌, తదితరులున్నారు.