సర్కారు చేతిలో అవినీతి అధికారుల చిట్టా..!

• సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మైనింగ్, పిసిబి, పోలీసు, విద్య, వైద్య, వివిధ శాఖల అధికారుల్లో టెన్షన్
• అవినీతికి పాల్పడిన జాబితాలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ శాఖలు ప్రథమం
• అవినీతిలో మునిగిన మరికొన్ని శాఖలపై అరా..!
• త్వరలోనే అధికారులు, సిబ్బందిపై వేటు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని శాఖల్లో ప్రక్షాళన మొదలు పెట్టింది. ఇంటెలిజెన్స్ అధికారుల రిపోర్ట్ ఆధారంగా అవినీతి అధికారుల బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, మైనింగ్, పిసిబి, విద్యా, వైద్య, పంచాయతీరాజ్, పోలీసు శాఖ, వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వానికి నివేదికలు వెళ్లినట్లు సమాచారం. ప్రతి రెవెన్యూ అధికారిపై ప్రత్యేక రిపోర్ట్ రూపొందించినట్లు తెలుస్తోంది. అవినీతి అధికారులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చర్చ నడుస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రక్షాళన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఇంటలిజెన్స్ అధికారుల సహాయంతో ప్రభుత్వశాఖలోని అధికారులు, సిబ్బందిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తున్నది. రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్స్, మైనింగ్, పిసిబి, విద్య, వైద్య, ఇరిగేషన్, జిల్లా పంచాయతీ, పంచాయతీరాజ్ శాఖలతో పాటు పోలీసు శాఖ మరియు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా ఇంటలిజెన్స్ అధికారులు ఏ విభాగంలో ఎంత మంది పనిచేస్తున్నారు..? వారు ఏఏ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారనే విషయాలను క్షుణంగా తీసుకున్నట్లు ప్రచారం సాగుతున్నది. అంతేకాకుండా ఈ శాఖల్లో పనిచేసే అధికారుల్లో అవినీతికి పాల్పడిన వారి వివరాలు సేకరించినట్లు సమాచారం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో భూ క్రయ విక్రయాలతో పాటు భూ అభివృద్ధి. లేవుట్లతో పాటు నాలా, కుంట, అసైన్డ్, భూధాన్, సీలింగ్, దేవాదాయ శాఖ లాంటి భూములకు ఇష్టానుసారంగా ఎన్వోసీలు ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, మైనింగ్, సబ్జిస్ట్రేషన్ శాఖల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగినట్లు నివేదికలు పంపినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

గత ప్రభుత్వంలో కీలుబొమ్మల్లా అధికారులు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు చెప్పిందే అధికారులు చేసినట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ నాయకులను అడ్డం పెట్టుకొని అందినకాడికి దోచుకుతిన్నట్లు ఒక్కోక్కటి బహిర్గతమవుతున్నాయి. రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించినట్లు సుస్పష్టం. ప్రభుత్వ ఆధీనంలోని భూములను పట్టాలుగా మార్చిన ఘనత రెవెన్యూ అధికారులకే సాధ్యమైంది. అదే సాధారాణ పౌరుడికి నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న ఘటనలు జిల్లాల్లో అనేకం. స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు ఎర్ర మట్టి దందా ఇష్టానుసారంగా చేశారు. టిప్పర్ల సహాయంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్లతోపాటు ఇండ్ల నిర్మాణానికి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా మైనింగ్ అధికారులు, పరిశ్రమలు పొల్యూషన్ చేస్తున్న పిసిబి అధికారులు కండ్లు మూసుకొని కూర్చున్నారు. టౌన్ ప్లానింగ్, హెచ్ఎండీఏ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మాణాలు, లే అవుట్లు, విల్లాలు నిర్మిస్తున్నా చూసీచూడనట్లు పంచాయతీ, టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించారు. ‘కాసులిచ్చుకో… కాజేసుకో” అనే పద్ధతిలో సబ్ రిజిస్ట్రార్స్ రిజిస్ట్రేషన్లు చేశారు. వైద్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్, ఒకే ప్రాంతంలో ఏండ్లకు యేండ్లు విధులు నిర్వర్తించడం, అనువైన ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు అధికారి మద్దతు, ప్రైవేట్, కార్పొరేట్ అసుపత్రులు నిబంధనలు పాటించకుంటే చర్యలుండవ్. ఈ విధంగా ప్రతి విభాగంలోని ఉన్నతాధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఆ సంస్థల్లో పనిచేసే ఒకరిద్దరు. చేసే తప్పులతో ఆ వ్యవస్థకే కలంకం కలుగుతుంది. చేతివాటాలకు అలవాటు పడి పనికోసం వచ్చే ప్రజల వద్ద ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసుకొని డిమాండ్ చేస్తున్నారు. అధికారి, సిబ్బంది అడిగినంత ఇస్తే వాళ్ల పని తక్షణమే అమలులోకి వస్తుంది. లేకపోతే నెలల కొద్దీ అధికారులు, సిబ్బంది చుట్టూ తిరిగినా ఫలితం ఉండదనే భావన ప్రజల్లో కలిగింది. దీనంతటికీ కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మేధావులు వివరిస్తున్నారు.