మానవాళికి ప్రమాదకారిగా మారుతున్న ఇథనాల్‌.. నరాలపై తీవ్ర ప్రభావం

సీసీఎంబీ పరిశోధకుల వెల్లడి

ఇథనాల్‌ మానవాళికి ప్రమాదకారిగా మారుతున్నది. శరీరాన్ని నియంత్రించే మెదుడు పనితీరుపైనే ప్రభావం చూపుతుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధనల్లో వెల్లడైంది. మద్యం, పర్‌ఫ్యూమ్స్‌, ప్లాస్టిక్‌, కాస్మోటిక్స్‌ వంటి ఇథనాల్‌ ఉండే ఉత్పత్తుల వినియోగం వల్ల ఎప్పటికైనా రోగాలను కొని తెచ్చుకున్నట్లేనని మరోసారి వెల్లడైంది. ఇథనాల్‌ వినియోగం వల్ల దీర్ఘకాలం పాటు కలిగే పరిమాణాలు, శరీరంలో మార్పులు, నాడీ వ్యవస్థ స్పందించే విధానంపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఎలుకలపై చేసిన అధ్యయనంలో ఇథనాల్‌ పరిణామం పెరిగిన కొద్ది నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను రికార్డు చేశారు. ఇలా మెదడులోని చాలా భాగం స్పందించే గుణాన్ని కోల్పోతుందని, దీంతో జీవక్రియలు కూడా మందగించినట్లుగా గుర్తించారు. 48 గంటల్లోనే ఇథనాల్‌ అందించిన ఎలుకలు స్పందనలో మార్పులు చోటుచేసుకున్నట్లుగా, మెదడు పనితీరు, స్పందనలను నియంత్రించలేకపోయినట్లుగా తేల్చారు.