అవినీతి తిమింగలం

  • రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు
  • 2 కిలోల బంగారం సీజ్
  • రూ. 40 లక్షల నగదు, 79 ఖరీదైన రిస్టు వాచ్ లు
  • బినామీ పేర్లతో 70 ఎకరాల భూములు పర్చేస్
  • పాతిక యాపిల్ ఫోన్లు, 50కు పైగా లాప్ టాప్ లు
  • రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పరోక్ష పెట్టుబడులు
  • ఇంట్లోని కరెన్సీ కౌంటింగ్ మెషీన్ తో లెక్కింపు
  • రాత్రి పొద్దుపోయే వరకూ కొనసాగిన సోదాలు

ఆదాయానికి మించి అవినీతి సంపదను పోగేసుకున్నాడని వచ్చిన ఆరోపణలతో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) సెక్రటరీ శివ బాలకృష్ణ నివాసంలో బుధవారం సోదాలు జరిపారు. ఈ సోదాల్లో బైటపడిన ఆస్తుల వివరాలను చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. ఏసీబీ అధికారులు పుప్పాలగూడలోని ఆయన నివాసంతో పాటు. కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లోనూ సోదాలు ఏకకాలంలో జరిపారు. ఆయన నివాసంలో భారీ స్థాయిలో (రూ. 40లక్షలు) నోట్ల కట్టలు బైటపడడంతో వాటిని లెక్కించడానికి ఆ ఇంట్లోనే ఉన్న కౌంటింగ్ మెషీన్ ను వినియోగించారు. 2 కిలోల బంగారం, 79 ఖరీదైన రిస్టు వాచీలు, విలువైన చరాస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆదాయానికి మించి ఆస్తులు
ఫీనిక్స్, ఆదిత్య రియల్ ఎస్టేట్ సంస్థల్లో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి ఆయన నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించగా ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదు. విచారణకు సహకరించడంలేదని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వ్యాఖ్యానించారు. గతంలో హెచ్ఎండీఏలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన బాలకృష్ణ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థలో ప్లానింగ్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వాటితో పాటు రెరా సెక్రటరీగానూ కొనసాగుతున్నారు. హెచ్ఎండీఏలో 2018 నుంచి 2023 వరకు అదనపు హోదాలో డైరెక్టర్ గా వ్యవహరించారు. అప్పట్లోనే ఆయన తన ఆదాయానికి మించి ఆస్తులు పోగేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

కీలకపత్రాలు స్వాధీనం
సోదాలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర మాట్లాడుతూ.. మొత్తం 17 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపారు. సాయంత్రం వరకు స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు ఐదు కోట్లు దాటిందన్నారు. మొత్తం రూ. 100 కోట్లు దాటొచ్చని సోదాల్లో పాల్గొన్న సిబ్బంది ప్రాథమిక అంచనా. దాదాపు పాతిక ఐ ఫోన్లు, 15 యాపిల్ లాప్ టాప్ లు, వందలాది. భూములకు సంబంధించిన పత్రాలు, కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నాలుగేండ్ల కాలంలోనే దాదాపు 70 ఎకరాల మేర భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, వివరాలు ఇవ్వడానికి నిరాకరించడంతో పూర్తి స్థాయిలో సేకరించలేకపోతున్నట్లు తెలిపారు. భూములు కొన్నవారితో పాటు లావాదేవీల్లో ఉన్నవారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు వివరించారు.

అవినీతికి పాల్పడిన ఆరోపణలకు సంబంధించి ఏసీబీ ఆఫీసర్లు సోదాలు చేసి కొన్నింటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బాలకృష్ణపై కేసును రిజిస్టర్ చేస్తున్నామని, కొన్ని బ్యాంకుల్లోని లాకర్లలో ఏమేం ఉన్నాయనేది గురువారం సోదాలు జరుపుతామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర పేర్కొన్నారు. ఏయే బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయనే వివరాలను కూడా తెలుసుకోవాల్సి ఉన్నదన్నారు. ఇప్పటివరకు స్వాధీనమైన అంశాలకు సంబంధించి ఆయన సహకరించడంలేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని పేర్కొన్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ సోదాలు జరిగాయని, గురువారం ఉదయం ఆయనను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

రూ.100 కోట్లపైనే
ఇప్పటివరకు స్వాధీనమైన ఆస్తుల వివరాలు దాదాపు రూ. 100 కోట్లు ఉండొచ్చని అంచనా. ఈ అవినీతిలో ఆయనకు సహకరించిన బినామీలు సత్యం, మూర్తి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఫీనిక్స్, ఆదిత్య రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉన్న బినామీ పెట్టుబడులపై ఒకటి రెండు రోజుల్లో ఆరా తీసిన తర్వాత వివరాలు బహిర్గతం కానున్నాయి. హెచ్ఎండీఏలో ఉన్నప్పటి నుంచే ఈ ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. బ్యాంకు లాకర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు ముగిస్తే మరికొన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతల అండదండలతోనే వందలాది కోట్ల రూపాయలను పోగేసుకున్నట్లు సమాచారం.