త్వరలో ఆటవీశాఖ, పీసీబీ అధికారుల బదిలీలు !

ఆటవీశాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఒకేచోట మూడేళ్లకు మించి సర్వీసు పూర్తయినవారికి స్థానచలనం కలగనున్నట్లు సమాచారం. తొలిదశలో 12 మంది ఐఎఫ్ఎస్ లను బదిలీ చేయాలని అటవీశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. అనుమతి కోసం ఆ జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించినట్లు తెలిసింది. ఐఎఫ్ఎస్ ల బదిలీలు పూర్తికాగానే ఇతర అధికారులకు స్థానచలనం కలిగించాలని ఆటవీశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర అటవీశాఖలో ఐఎఫ్ఎస్ స్థాయిలో 81 పోస్టులు మంజూరు కాగా, 55 మంది పనిచేస్తున్నారు.

అటవీశాఖ తర్వాత పిసిబిలో..
అటవీశాఖలో బదిలీలు పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. పీసీబీలో కొద్దిమంది అధికారులు దశాబ్దానికి పైగా ఒకేచోట పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు, దీర్ఘకాలం హైదరాబాద్ పరిమితమైన వారి బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.