• 8 రోజులు అనుమతిచ్చిన నాంపల్లి కోర్టు
• బ్యాంక్ లాకర్స్, బినామీల ఆస్తులపై ఏసీబీ ఫోకస్
• హెచ్ఎమ్ డీఏలో మిగతా వ్యక్తులపైనా నజర్
హెచ్ఎమ్ డీఏ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణకు నాంపల్లి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. బుధవారం నుంచి 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడన్న ఫిర్యాదులతో బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బినామీల పేర్లతో ఉన్న ఆస్తులు, బ్యాంక్ లాకర్ లను ఓపెన్ చేసేందుకు బాలకృష్ణను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు… 8 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంక్ లాకర్ లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. దీంతో పాటు బినామీ పేర్లతో ఉన్న ఆస్తులు, హెచ్ఎమ్ డీఏలోలో బాలకృష్ణతో కుమ్మక్కైన అధికారుల వివరాలను సేకరించనున్నారు.
విచారణకు సహకరించలేదని
సోదాల సమయంలో బాలకృష్ణ సహరించలేదని ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే లాకర్ల కీస్ స్వాధీనం చేసుకున్నారు. లాకర్స్ ఓపెన్ చేసేందుకు కోర్టు అనుమతులు కూడా తీసుకున్నారు. బాలకృష్ణ సహా లాకర్ హోల్డర్స్ సమక్షంలో ఓపెన్ చేయనున్నారు. బ్యాంక్ అధికారుల వాంగ్మూలం రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే రూ.వందల కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు.. కస్టడీలో బాలకృష్ణను విచారించడం ద్వారా మరికొన్ని విలువైన ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది.
వందల కోట్లు స్వాధీనం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పుప్పాలగూడలోని బాలకృష్ణ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు. రూ.99.60 లక్షలు క్యాష్, 1988 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రూ.8.26 కోట్లు లక్షలు విలువ చేసే ల్యాండ్ డాక్యుమెంట్స్, రూ.5.96 లక్షలు విలువ చేసే వాచీలు, ట్యాబ్స్ సహా ఇతర గృహోపకరణాలను సీజ్ చేశారు. 90 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లు ఇతరుల పేర్లతో ఉన్న 8 ఫ్లాట్లను గుర్తించారు. బాలకృష్ణ ఆయన భార్య పేరుతో ఉన్న నాలుగు బ్యాంక్ అకౌంట్స్ ను గుర్తించారు. బాలకృష్ణకు చెందిన ఆస్తుల వివరాలను రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.