- జారీచేసిన సుప్రీం కోర్టు
పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే బోర్డులు, ప్రాధికార సంస్థల నియామకాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం కేంద్ర సాధికార సంస్థ నియామకంపై బుధవారం వెలువరించిన తీర్పులో నిర్దేశించింది. ఇవి భారత జంతు సంక్షేమ మండలి, అణు ఇంధన నియంత్రణ మండలి, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, వన్యప్రాణి సంరక్షణ డైరెక్టర్, జాతీయ, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండళ్లు, సెంట్రల్ జూ అథారిటీ, జాతీయ పులల సంరక్షణ ప్రాధికార సంస్థ, తీరప్రాంత నిర్వహణ ప్రాధికార సంస్థ, కేంద్ర భూగర్భ జలమండలి, జాతీయ, రాష్ట్ర జీవ వైవిధ్య ప్రాదికార సంస్థలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రకృతి వైపరీత్య నిర్వహణ ప్రాధికార సంస్థలు, జాతీయ హరిత ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయి సలహా మండళ్లు, నేషనల్, స్టేట్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ ఆధారిటీస్, పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ, నిపుణుల మదింపు కమిటీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, వన్యప్రాణుల నేర నియంత్రణ బ్యూరోలకు వర్తిసుందని సుప్రీం కోర్టు పేర్కొంది.
◆ ఈ సంస్థల్లో సభ్యుల కూర్పు, అర్హతలు, పదవీ కాలం, నియామక విధానం, నియమితులైన వారి తొలగింపు విధివిధానాలను స్పష్టంగా పేర్కొనాలి. నియామకాలను క్రమం తప్పకుండా చేపట్టి ఆ సంస్థలు నిరంతరం కొనసాగేలా చూడాలి. ఆయా రంగాల్లో అవసరమైనంత జ్ఞానం ఉన్న వ్యక్తులనే నియమించాలి.
◆ ఈ సంస్థలకు తగిన నిధులు కేటాయించాలి. వాటి ఆర్థికస్థితిగతులు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉండేలా చూడాలి.
◆ ప్రతి సంస్థ బాధ్యతలను తప్పనిసరిగా నిర్వచించాలి. దానివల్ల ఒకరి పరిధిలోకి మరొకరు జొరబడటం (ఓవర్ ల్యాప్), ఒకే పనిని ఇద్దరు చేయడం (డూప్లికేషన్) తప్పుతుంది. సంస్థల మధ్య నిర్మాణాత్మక సహకారం ఎలా ఉండాలో కూడా స్పష్టంగా నిర్వచించాలి.
◆ అన్ని సంస్థలూ తమ పనికి సంబంధించిన నిబంధనలు, విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించుకొని నోటిఫై చేయాలి. వాటిని ప్రాంతీయభాషలతో సహా వెబ్ సైట్ లో ఉంచాలి. ఒకవేళ నిబంధనలు రూపొందించుకొనే అధికారం ఆ సంస్థలకు లేకపోతే సమగ్రమార్గదర్శకాలను ప్రామాణిక విధానంలో నోటిఫై చేయాలి.
◆ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి, అనుమతులు ఇవ్వడానికి అనుసరించే విధి విధానాల గురించి స్పష్టంగా పేర్కొనాలి.
• ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే విధానం, నిర్ణయాధికార ప్రక్రియ, అభ్యంతరాలుంటే ఆప్పీల్ చేసుకొనే హక్కు గురించి స్పష్టంగా నోటిఫై చేయాలి. అందుకు సంబంధించిన గడువులనూ చెప్పాలి.
◆ ఏయే అధికారికి ఏయే బాధ్యతలు అప్పగించారు? వారి బాధ్యతలు ఏంటన్నది స్పష్టంగా పేర్కొని జవాబుదారీతనాన్ని అమలు చేయాలి.
◆ ఈ సంస్థల పనితీరు గురించి వ్యవస్థీకృత ఆడిట్ నిర్వహించాలి అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది