అవినీతిపరులపై ఉక్కుపాదం!

• అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు
• ఈడీ, ఐటీ శాఖలతో సమాచారం పంచుకోనున్న రాష్ట్ర పోలీసులు

ఆర్థిక మోసాలకు పాల్పడేవారు, అవినీతిపరులపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. అలాంటివారు అడ్డగోలుగా ఆర్జించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకునేలా సంబంధిత కేసులను ఈడీతోపాటు ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు రాష్ట్ర పోలీసులు సిఫార్సు చేయనున్నారు. అవినీతిపరులు, మోసాలకు పాల్పడుతున్నవారిపై నమోదవుతున్న కేసులు రకరకాల కారణాలతో ఏళ్ల తరబడి నడుస్తున్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఈడీ అయితే నిర్ణీత సమయంలో అక్రమ ఆస్తులను జప్తు చేస్తుంది.

ఐటీ శాఖ కూడా లెక్కల్లో చూపని ఆదాయం, ఆస్తులను గుర్తిస్తుంది. వీలైనంతవరకూ ఆక్రమార్కులకు కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ఆయా విభాగాలను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పట్టుబడిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును ఈడీకి, ఐటీ శాఖకు సిఫార్సు చేయనున్నారు. ఇక మీదట ఇలాంటి కేసులన్నీ ఆయా విభాగాలకు పంపనున్నారు.

36 రకాలుగా ఆర్థిక మోసాలు..

రాష్ట్రంలో ఆర్థిక మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతు న్నాయి. 2022లో 21,499 చీటింగ్ కేసులు నమోదు కాగా మరుసటి ఏడాది (2023)కి ఇవి 22,996కు పెరిగాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే రూ.16 వేల కోట్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. అంటే ప్రజలు అంత మొత్తంలో మోసపోయారు. రాష్ట్ర, వ్యాప్తంగా చూస్తే ఈ మొత్తం రూ.50 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇందులో రకరకాల మోసాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పేరుతో జరిగే మోసాలకు కొదవేలేదు. తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, పెట్టుబడికి అత్యధిక ఆదాయం ఇస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని.. ఇలా దాదాపు 36 రకాలుగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. రాజధాని పరిధిలోని 3 కమిష నరేట్లలో కలిపి గత ఏడాది దాదాపు రూ.10 వేల కోట్లకు సంబంధించి రియల్ ఎస్టేట్ మోసాలు జరిగాయి. అధిక వడ్డీలకు ఆశపడి.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మి.. మోసపోయిన చాలామంది రూ. కోట్లలో నష్టపోయారు. అక్రమార్జనకు అలవాటు పడినవారు ఎంతోమందికి ఇలాంటి మోసాలు నిత్యకృత్యమైపోయాయి. కరక్కాయలు కరగదీసి ఇస్తే పెద్దమొత్తంలో డబ్బులిస్తామని చెబుతూ చేసిన మోసం తెలిసిందే. ఆన్లైన్లో పంపిన సమాచారాన్ని పీడీఎస్గా మార్చిఇస్తే డబ్బు ఇస్తామని నమ్మిస్తూ రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన వాటిని రకరకాల మార్గాల్లో ఇతర ఖాతా ల్లోకి మళ్లిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసినా నిందితులు కొద్దిరోజుల్లో బెయిల్ తీసు కొని బయటకు వస్తున్నారు. పోలీసులకు ఉండే పనిఒ త్తిడి వల్ల ఇలాంటి కేసులు ఏళ్ల తరబడి దర్యాప్తులోనే ఉండిపోతున్నాయి. దీనివల్ల బాధితులకు ఊరట లభించడం లేదు. ఈ మేరకు పెద్దమొత్తంలో వసూలు చేసి మోసాలకు పాల్పడిన కేసుల వివరాలను ఈడీకి, ఐటీ, శాఖకు పంపాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.. గతంలోనూ ఈడీ అధికారులు ఇలా కొన్ని కేసులు తీసు కున్నారు. వసూలు చేసిన డబ్బును ఇతర ఖాతాల్లోకి మళ్లించారని అనుమానించిన ప్రతి కేసునూ ఇకపై రాష్ట్ర పోలీసులు ఈడీకి సిఫార్సు చేయాలని భావిస్తున్నారు.. తద్వారా మోసపూరితంగా ఆర్జించి, సమకూర్చుకున్న ఆస్తులను సత్వరమే జప్తు చేయాలనేదే అధికారుల లక్ష్యం. అలాగే ఐటీ శాఖకూ వివరాలు ఇవ్వడం ద్వారా ఆయా సంస్థల నిర్వాహకులు నల్లధనాన్ని ఎలా వెనకే సుకుంటున్నారో వెలికి తీయనున్నారు. అలాగే అవినీతి కేసుల్లో పట్టుబడిన వారి వివరాలనూ ఈడీ, ఐటీ శాఖ లతో పంచుకోనున్నారు. అవినీతిపరులు ఆదాయానికి మించి ఆర్జించిన మొత్తంతో ఇతర ఆస్తులు కూడబెట్టుకో వడం.. బంధువులు, సన్నిహితులను బినామీలుగా పెట్టుకొని వారి ఖాతాల్లోకి మళ్లించడం చేస్తున్నారు. ఇది కూడా నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) పరిధిలోకే వస్తుంది. ఇటువంటి వారి ఆస్తులు కూడా గుర్తించి జప్తు చేయించనున్నారు.