శివబాలకృష్ణ చిట్టా తవ్వుతూనే ఉన్నరు!.. ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో టెన్షన్‌

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టైన శివ బాలకృష్ణ విచారణలో బహుళ అంతస్థుల భవన నిర్మాణ అనుమతులు కీలకంగా మారాయి. రెరా సెక్రెటరీ, మెట్రో రైలు ప్లానింగ్‌ విభాగం జీఎంగా బదిలీ కాకముందు ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ)లో ప్లానింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏలో ఆయన పనిచేసిన సమయంలో ఇచ్చిన మల్టీ స్టోర్డ్‌ బిల్డింగ్స్‌ (ఎంఎస్‌బీ) లెక్కలను తీసే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. పలుమార్లు బాలకృష్ణను ఏసీబీ విచారించినా, ఆ సమయంలో ఆయన పెద్దగా నోరు విప్పలేదు. కాగా చాలా ఫిర్యాదులు అనుమతులు ఇచ్చే విషయంలోనూ రావడంతో ఏసీబీ అధికారులు హెచ్‌ఎండీఏలో ఫైళ్లను సేకరిస్తున్నారు. ఇప్పటికే గత ఆదివారం సెలవు రోజు అయినా ఫైళ్లను ఏసీబీ పరిశీలనకు ఇచ్చేందుకు ప్రత్యేకంగా హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం అధికారులు సేకరించారు. గత వారం రోజులుగా ఇదే పనిలో ఉన్నట్లుగా కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వేలాది దరఖాస్తులు ఉండడంతో వాటిని గుర్తించడానికి అధిక సమయం పడుతున్నదని చెబుతున్నారు.

గ్రేటర్‌ పరిధి దాటిన తర్వాత ఉన్న ప్రాంతమంతా హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉంది. నగరం నలువైపులా ఉన్న హెచ్‌ఎండీఏలో 4 జోన్లు (శంకర్‌పల్లి, శంషాబాద్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌) ఉండగా, ఇందులో శంకర్‌పల్లి, మేడ్చల్‌ జోన్ల పరిధిలోనే ఎక్కువ సంఖ్యలో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు వచ్చాయి. 2018 నుంచి 2023 జూలై వరకు హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా శివబాలకృష్ణ పనిచేశారు. ఆ సమయంలో ఇచ్చిన అనుమతుల వివరాలను ప్రత్యేకంగా నివేదికలను సిద్ధం చేయడంతో పాటు దరఖాస్తు పత్రాలను బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ) విషయంలో ఎలాంటి పరిమితులు లేకపోవడంతో మొత్తం విస్తీర్ణంలోని భూమికి అనుగుణంగా అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, దాన్ని పక్కన పెట్టి ఎక్కువ అంతస్థులకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అలాంటి అనుమతులు పొందిన భారీ బహుళ అంతస్థుల భవనాల దరఖాస్తులను ప్రత్యేకంగా సేకరించి, వాటి కోసం తయారు చేసిన నివేదికలను సేకరిస్తున్నారు.

రోడ్డు విస్తీర్ణం సరిగా లేకున్నా, ఎక్కువ మొత్తంలో అంతస్థులు నిర్మించుకునేలా ఇచ్చిన పైళ్లను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉండడంతో హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం అధికారులు, ఉద్యోగులు ఫైళ్లను వారు అడిగినట్లుగా ఇచ్చేందుకు అయిష్టంగానే పనిచేస్తున్నట్లు సమాచారం. శివ బాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు ప్రభావం పూర్తిగా హెచ్‌ఎండీఏ కేంద్రంగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రణాళికా విభాగం అధికారులు భయాందోళనతో ఉన్నారు. ఈ కేసు కారణంగానే పనిఒత్తిడి పెరిగి ఓ ఉద్యోగి గుండె పోటుతో మృతి చెందిన సంఘటన హెచ్‌ఎండీఏలో మరింత ఆందోళనకు దారి తీసింది. ఈ కేసు పరిణామాలతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న భయం ఉద్యోగులను వెంటాడుతూనే ఉంది.

సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) EE అవినీతి వెనుక ఉన్న ఆ ఉన్నతాధికారి ఎవరు..?
వసూళ్లలో ఆ ఉన్నతాధికారికి వాటా వెళ్తుందా..? ఈ వివరాలే కాక..
సంగారెడ్డి పరిధిలోని కాలుష్య పరిశ్రమల ఫిర్యాదుల విషయంలో.. CFE, CFO రెన్యువల్, అనుమతులలో లంచం డిమాండ్.. ఇంకా ఎన్నిరకాలుగా సంగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) RO కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి అధికారుల (EE, AEE) బాగోతాలపై “రాబోయే కథనంలో” మీ ముందుకు తీసుకువస్తుంది.. మీ ‘‘నిఘానేత్రం న్యూస్‘‘ నిఘానేత్రం న్యూస్ పేదోడి పక్షం.. అవినీతిపైనే మా పోరాటం..