ఇకపై టీఎస్‌ కాదు; టీజీ.. వాహనాల రిజిస్ట్రేషన్‌లో మార్పునకు చట్టం

  • రాష్ట్ర అధికారిక లోగో, తెలంగాణ తల్లి
  • విగ్రహం రూపురేఖల్లోనూ మార్పులు
  • రాష్ట్ర గీతంగా ‘జయజయహే తెలంగాణ’

తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది. వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఇకపై టీఎస్‌ నుంచి టీజీగా మార్చేందుకు చట్టం చేయనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని గుర్తుకు తెచ్చేలా ఉన్నదని, రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు చెప్పారు. కవులు, కళాకారులు, మేధావుల అభిప్రాయాలను తీసుకొని తుది రూపు ఇస్తామని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వారు, అనేకసార్లు జైలుకు వెళ్లిన వారికి తెలంగాణ చిహ్నంలో స్థానం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ఇప్పటివరకు 14.25 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించారని వెల్లడించారు. త్వరలో తాము అమలుచేయబోమే మరో రెండు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని చెప్పారు.

గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి కసరత్తు
ఉద్యోగ నియమాకాలకు సంబంధించి వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నామని మంత్రులు చెప్పారు. గ్రూప్‌ 1, 2, 4 ఉద్యోగాలకు సంబంధించి పూర్తిస్థాయి కసరత్తు చేసిన తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. మెగా డీఎస్సీకి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించాలని, పాత డీఎస్సీ కేసులకు సంబంధించిన వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏఈవోల ఖాళీల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తమ హయాంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రక్రియ మొదలైందని అన్నారు. ఇక ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో కసరత్తు జరుగుతుందని తెలిపారు. హైకోర్టుకు కేటాయించిన 100 ఎకరాల భూమిపై విద్యార్థులు, మేధావులు చేస్తున్న అభ్యంతరాలు తమ దృష్టికి వచ్చాయని త్వరలో పరిషారం చూపుతామని అన్నారు.

రేపు రాంచీకి సీఎం, డిప్యూటీ సీఎం
రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో న్యాయయాత్రలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార సోమవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్ళనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో వెళ్లి, సాయంత్రం తిరిగి రానున్నారు.

క్యాబినెట్‌ నిర్ణయాలు..

  • 8 నుంచిఅసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.
  • మరో రెండు గ్యారెంటీల అమలుకు ఆమోదం. అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి.
  • వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్‌ నుంచి టీజీగా మార్పు, త్వరలో చట్టం.
  • రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’
  • కుల గణనకు ఆమోదం.
  • తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖల మార్పు.
  • తెలంగాణ అధికార చిహ్నం మార్పు.
  • కొడంగల్‌కు ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు.
  • రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌గా మార్పు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కోర్సులు.
  • హైకోర్టుకు వంద ఎకరాల భూమి మంజూరు చేస్తూ ఆమోదం.
  • ఖైదీలకు క్షమాభిక్షపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా నిర్ణయం.