అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

  • ప్రభుత్వ భూములు, జల వనరులను పరిరక్షించాలి

సంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ పై ఉక్కు పాదం మోపాలని, నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ జరుగుతున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ మైనింగ్ ను అరికట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవిన్యూ శాఖదన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా క్షేత్రస్థాయిలో పరిరక్షించాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు కాపాడాలన్నారు. జల వనరులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అక్రమ మైనింగ్, ప్రభుత్వ భూములు, వాటర్ బాడీస్ ఆక్రమణలను అరికట్టడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పీ అశోక్, ఆయా శాఖల అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.