బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి

 భార‌తీయ జ‌న‌తా పార్టీ శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డిని బీజేఎల్‌పీ నేత‌గా నియ‌మిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. బీజేఎల్‌పీ ఉప‌నేత‌లుగా పాయ‌ల్ శంక‌ర్, వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి నియామ‌కం అయ్యారు. శాస‌న‌మండ‌లి పక్ష‌నేత‌గా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డికే బీజేఎల్పీ నేతగా ఎక్కువ అవకాశాలున్నాయ‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌లకు కొన్ని నెల‌ల ముందే మ‌హేశ్వ‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించగా.. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్‌ నుంచి రాకేశ్‌ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఇందులో రాజాసింగ్‌, మహేశ్వర్ రెడ్డి మినహా మిగతా వారందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే.