కుల గణన తీర్మానానికి శాసనసభ ఆమోదం

రాష్ట్రం కుల గణన కోసం అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా.. ఆ తర్వాత సభ్యులందరూ చర్చించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కులగణనపై తీర్మానం కాకుండా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణనకు చట్టం చేయాలని సూచించారు. . కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్నారు. ఎంబీసీలను మొదటి గుర్తించినదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని, బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీహార్‌లో ఇప్పటికే కులగణన చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని డిమాండ్‌ చేసిన నేత కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. చట్టబద్ధత లేకపోతే కులగణన సఫలం కాదన్న కేటీఆర్‌.. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉందన్నారు.

బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుందని.. అప్పుడే కులగణన సఫలం అవుతుందన్నారు. శాసనసభను మరో రెండు రోజులు పొడిగించి.. కులగణనపై బిల్లులు తేవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కులగణనతో పాటు సామాజిక, ఆర్థిక, విద్య అవకాశాల కోసం కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శాస్త్రీయంగా ప్రణాళిక రూపొందించే క్రమంలో సర్వే ఉంటుందని తెలిపారు. సలహాలు, సూచనలు తీసుకోవడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని తెలిపారు.