- సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేసిన బాధితులు
ఏసీబీ ఆదికారుల పేరిట తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు ఆగంతుకులు ఫోన్ లో బెదిరించడంతో బాధితులు సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి… పీసీబీ ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ యశ్వంత్ కుమార్ శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన ఈపీటీ ఆర్ఐ శిక్షణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.54 గంటలకు యశ్వంత్ కుమార్ అధికారిక ఫోన్ నంబరుకు ఆగంతుకుడు 81432 71748 నంబరు నుంచి ఫోన్ చేశాడు. ‘తాను ఏసీబీ ప్రధాన కార్యా లయం నుంచి ఫోన్ చేస్తున్నానని. మీరు ఎక్కడ ఉన్నారని’ ఆరా తీశాడు. అనుమానం వచ్చిన యశ్వంత్ కుమార్ ‘మీరెవరని.. మీ పేరేమిటని’ అడగటంతో ఫోన్ పెట్టేశాడు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేశారు.
మరో సంఘటనలో..
పీసీబీ సీనియర్ ఎన్విరాన్ మెంట్ (SEE) ఇంజినీర్ బి.వి. భద్రగిరీష్ బీరంగూడలోని రామచంద్రపురం జోనల్ కార్యా లయంలో ఉండగా.. మధ్యాహ్నం 1.33 గంటలకు 81432 71748 నంబరు నుంచి ఆగంతుకుడు ఫోన్ చేశాడు. తాను ఏసీబీ అధికారినంటూ మాట్లాడాడు. ‘మీపై ఏసీబీలో కేసులు పెట్టారని బెదిరించాడు. అనుమానం వచ్చిన భద్రగిరీష్ ‘మీ హోదా ఏమిటని’ ప్రశ్నించాడు. తాను ఏసీబీలో విచారణ ఇన్స్పెక్టర్ నంటూ బెదిరించే ప్రయత్నం చేశాడు. ‘నాతో మీకేం పని’ అని ప్రశ్నించేసరికి వ్యక్తిగతంగా కలుస్తానంటూ ఫోన్ పెట్టేశాడు. ఇదే తరహాలో ఆగంతుకులు ఇతర పీసీబీ అధికారులకు ఫోన్ చేసి డబ్బు కోసం బెదిరించినట్లు బాధితుడు సైబర్ క్రైం పోర్టల్ కు పిర్యాదు చేశాడు.