ఏసీబీ వలలో గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

  • బాలుర హాస్టల్ బిల్లుల క్లియరెన్స్ కు రూ.84 వేలు డిమాండ్
  • ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్ గంగన్న.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు
  • వెక్కివెక్కి ఏడ్చిన అధికారిణి జగజ్యోతి

లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి ఏసీబీ అధికారులకు చిక్కింది. సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో గిరిజన సంక్షేమ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కె. జగజ్యోతి పనిచేస్తోంది. అయితే, నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడాలో గాజుల రామారం స్థలంలోని బాలుర హాస్టల్ భవనం పనుల బిల్లు క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్ బోడుకం గంగన్న నుంచి రూ.84 వేలను లంచంగా అధికారిణి జగజ్యోతి డిమాండ్ చేసింది. దీంతో గంగన్న ఏసీబీని ఆశ్రయించగా వారి సూచన మేరకు మాసబ్ బ్యూంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో అధికారిణి జగజ్యోతికి డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడులు జరిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ. 65 లక్షల నగదు. రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆ కార్యాలయంలోనూ కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో జగజ్యోతి వెక్కివెక్కి ఏడ్చింది. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హజరుపరిచారు. ఈఈ స్థాయి అధికారి అయిన జగజ్యోతి ఇన్ చార్జ్ హోదాలో ఎస్ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే రాష్ట్ర ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని కోరారు.