- కొందరికి పదోన్నతులు
- అటవీశాఖ తర్వాత పిసిబిలో..
తెలంగాణలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ, మరికొందరికి పదోన్నతులు వర్తింపచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. బి.షఫీయుల్లాను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ గా నియామకం చేయగా, ప్రియాంక వర్గీస్-సీసీఎఫ్ (ఐటీ) వింగ్ కు బదలీ చేశారు. ఆమె గత ప్రభుత్వంలో సీఎం కార్యాలయంలో విధులు నిర్వహించారు. సీఎం ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహించారు. ఎస్టే ఆశా – ములుగు ఫారెస్ట్ కాలేజి డీన్ గా నియమించారు. ప్రభాకర్ ను కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్ గా, మహబూబాబాద్ డీఎఫ్ఓ గా ఉన్న రవికిరణ్ ను మీ సేవా కమిషనర్ గా బదలీ చేశారు. వరంగల్ డీఎఫ్ఓ ఆపర్ణను డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హైదరాబాద్ కు, ఏటూరు నాగారం డీఎఫ్ఓ అంజు అగర్వాల్ ను వరంగల్ డీఎఫ్ఓగా నియమించారు.
ఆమ్రాబాద్ డీఎఫ్ఓ విశాల్ బత్తులను డీఎఫ్ఓ మహబూబాబాద్ కు బదలీ చేశారు. అదేవిధంగా ఐఎఫ్ఎస్ శాంతారామ్ ను కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా పదోన్నతిని వర్తింపజేశారు. ఆయనకు మంచిర్యాల కవాల్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్. రాంబాబును డీసీఎఫ్ హైదరాబాద్ కు, డాక్టర్ సునీల్ ఎస్ హిరేమతన్ ను నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ గా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
అటవీశాఖ తర్వాత పిసిబిలో..
అటవీశాఖలో బదిలీలు పూర్తయ్యాక తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. పీసీబీలో కొద్దిమంది అధికారులు దశాబ్దానికి పైగా ఒకేచోట పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నవారు, దీర్ఘకాలం హైదరాబాద్ పరిమితమైన వారి బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
