తెలంగాణ పీసీబీలో అసమర్థుల్ని సాగనంపండి

  • జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరు(JCEE) కృపానంద్ పై వేటు వేయండి
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లోని అధికారుల పనితీరుపై బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అధికారులు తమ అధికారాల్ని ఆస్వాదించడానికి కార్యాలయాల్లో కూర్చోరాదు. ప్రజల హక్కులను రక్షించే బాధ్యత వారిపై ఉంది’ అని వ్యాఖ్యానించింది. పీసీబీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చినా.. ఇవ్వలేదంటూ ఫిబ్రవరి 15న మూసివేత ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాలోని ప్రోస్టర్స్ అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె. అనిల్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి పీసీబీ జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీరు(JCEE) కృపానంద్ కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ధర్మాసనం ముందు హాజరయ్యారు. మూసివేత ఉత్తర్వులను మరో అధికారి ఇచ్చారని ఆయన చెప్ప డంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఒక అధికారి నోటీసులు జారీ చేయడం.. మరో అధికారి మూసివేత ఉత్తర్వులు ఇవ్వడాన్ని చట్టం అంగీకరించదు. బదిలీ, ఇంకేమైనా అనివార్య సంఘటనల సందర్భంలో మాత్రమే మరో అధికారి.. షోకాజ్ నోటీసులకు కొనసాగింపుగా చర్యలు చేపట్టవచ్చు. అయితే ఇక్కడ షోకాజ్ నోటీసు జారీ చేసిన అధికారి.. మూసివేత ఉత్తర్వులు ఇవ్వడానికి మరో అధికారికి అధికారాలను అప్పగించడం విచిత్రంగా ఉంది. పరిశ్రమల యాజమాన్యాలతో లాలూచీ పడటానికి ఇద్దరూ అవకాశాలు చూసుకుంటున్నట్లుంది. ఇలాంటి అసమర్థ అధికారుల్ని కొనసాగించడానికి వీల్లేదు. ఈ అధికారిపై మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. అయితే ఇతరులకు ఒక సందేశం ఇవ్వాల్సి ఉంది. జాయింట్ చీప్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరుగా ఉన్న కృపానంద్ కి నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోండి. ఒకవేళ అతన్ని కొనసాగిస్తే మేము సుమోటోగా కోర్టు ధిక్కరణగా తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తాం” అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ‘ఆ అధికారిని ఆ స్థానం నుంచి తొలగించాల్సిందే. ఈ మాదిరిగా విధులు నిర్వహించే వ్యక్తి ఇంజినీరింగ్ ఎలా పూర్తి చేశారు? మన ఇంజినీరింగ్ కాలేజీల శిక్షణపై సందేహాలు తలెత్తుతున్నాయి. JCEE కృపానంద్ మాత్రమే కాదు.. గత ఏడు నెలలుగా చూస్తున్నాం. పీసీబీ పనితీరు చాలా దారుణంగా ఉంది. దీన్ని ప్రక్షాళన చేసే సమయం ఆసన్నమైంది. అసమర్థ అధికారుల్ని సాగనంపి సమర్థుల్ని విధుల్లో నియమించాలి” అని హితవు పలికింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇదే తగిన సమయమని పేర్కొంది. సాంకేతిక కారణాల రీత్యా ప్రోస్టర్స్ సంస్థ మూసివేతకు ఫిబ్రవరి 15న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని పేర్కొంది. కొత్తగా వచ్చే అధికారికి ఈ వ్యవహారాన్ని అప్పగించాలని, దీనిపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్ ను విచారణను మూసివేసింది.(సోర్స్: ఈనాడు)

పీసీబీలో అసమర్థుల్ని సాగనంపండి