- వరుస దాడులతో అవినీతి అధికారులపై ఫిర్యాదులు వస్తున్నాయి..
- ఏసీబీ డీజీ సీవీ ఆనంద్
అవినీతి నిరోధక శాఖ(ACB) పనితీరుపై ప్రజల్లో నమ్మ కం ఏర్పడిందని, ఆ నమ్మకాన్ని మరింత పెంచాలని ఏసీబీ సిబ్బందికి ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ కోరారు. ఈక్రమంలో ఏసీబీ ప్రధాన కార్యాలయంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ గడచిన మూడు నెలల్లో ఏసీబీ అధికారులు సమర్ధవంతంగా పని చేయడం వల్ల ఏసీబీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. అవినీతిపరులపై అందిన ఫిర్యాదులపై ప్రతి ఒక్కరూ సకాలంలో స్పందించారన్నారు. అవినీతిపరుల ఆట కట్టించగలమన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించాలని సూచించారు. 2 నెలలుగా జరిపిన వరుస దాడులతో పలువురు అవినీతి అధికారులపై ఫిర్యాదులు ఇవ్వటానికి ముందుకొస్తున్నట్టు చెప్పారు. ప్రతీ కేసును ఓ క్రమపద్ధతిలో ఓపికగా పరిష్కరించి సిబ్బందికి ఇచ్చిన ఆపరేషన్ విజయవంతం చేయాలని సూచించారు. కేసు డైరీలు రాసేటప్పుడు, నిందితుల ఆస్తులు జప్తు సమయంలో ఏసీబీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కేసుల విషయంలో గోప్యత పాటించి చట్ట ప్రకారం అన్ని విధానాలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో విచారణలో ఉన్న కేసులు, ప్రాసిక్యూషన్ ఉత్తర్వులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కేసులు, ముసాయిదా తుది నివేదికలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, ట్రయల్స్ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఏసీబీ పోలీసు సిబ్బందికి ఐపీఎస్ సేవా, ఉత్తమ సేవ, ఉత్మ్కష్ట సేవా పతకాలను అందజేశారు. దీంతో పాటు గత మూడు నెలల్లో అవినీతికి పాల్పడిన అధికారులపై ఉచ్చు బిగించడంలో విశేష కృషి చేసిన ఏసీబీ సిబ్బందికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే ఏసీబీ నుంచి బదిలీ అయిన అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు.