మరోసారి ఏపీ ప్రజల మోసం చేసేందుకే చంద్రబాబు పొత్తులు : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

 ఏపీలో వైసీపీ పాలనలో ఇంటింటికి అందుతున్న పథకాలను చూసి ఎన్నికల్లో గెలుపొందలేమన్న ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకున్నారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(CM Jagan) ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిర్వహించిన వైసీపీ సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు నేరుగా వైసీపీతో తలబడ లేక ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కలిసి ఢిల్లీ పెద్దలను కలిశారని దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకే పొత్తులు కుదుర్చుకున్నారని విమర్శించారు. పొత్తులో సైన్యాధిపతులే తప్ప వారికి సైన్యం లేదని దుయ్యబట్టారు. కొన్ని పార్టీలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని పార్టీలు, రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలు, ఓడిపోయిన పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాదిరిగా నాకు స్టార్‌క్యాంపెయినర్లు లేరు. నాకు ప్రజలే క్యాంపెయినర్లని, వైసీపీకి 5 కోట్ల మంది ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు.

తమకు విలువలు, విశ్వసనీయత, సిద్ధాంత బలం, ఇంటింటికి మంచిచేశామన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రజలది కృష్ణుడి పాత్రయితే, తనది అర్జునుడి పాత్ర అని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను99 శాతం అమలు చేశామని పేర్కొన్నారు.

టీడీపీ గుర్తయిన సైకిల్‌కు నేడు ట్యూబులు లేవు. టైర్లు లేవు.చక్రాలు లేవు. తుప్పు పట్టిన సైకిల్‌ను తోలటానికి ఇతర పార్టీల మద్దతు తీసుకుంటున్నారని జగన్‌ విమర్శించారు. ఎంత మందితో పొత్తుపెట్టుకున్న వారి విలువ సున్ననేనని వెల్లడించారు. 2014లో అదే మూడుపార్టీలతో పొత్తులు ఏర్పడి ప్రత్యేక హోదా,రుణ మాఫి , డ్వాక్రా మహిళలకు రుణాలు, ఇంటింటికీ ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ భృతి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, తిరిగా అదే కూటమి నేడు పొత్తులతో వస్తున్నాయని దుయ్యబట్టారు.