తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా రేపు సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణం

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్ నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రికి రాధాకృష్ణ‌న్ హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు. బుధ‌వారం ఉద‌యం 11:15 గంట‌ల‌కు సీపీ రాధాకృష్ణ‌న్ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌మాణం చేయించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఏర్పాట్లలో రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు నిమ‌గ్న‌మ‌య్యాయి.

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆ బాధ్య‌త‌ల‌ను రాధాకృష్ణ‌న్‌కు అప్ప‌గించిన‌ట్లు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చేరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరుతూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ లేఖ రిలీజ్ చేసింది. బాధ్య‌త‌లు స్వీక‌రించిన క్ష‌ణం నుంచి నియామ‌కం అమ‌లులోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆ రిలీజ్‌లో తెలిపింది.