11న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఐఎఎస్‌ల భారీ బదిలీల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యంకలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈనెల 11న సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో అనేక కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించ నున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారులను,జిల్లాకలెక్టర్ల బదిలీలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు బదిలీల్లో కొత్తగా పలువురు ఐఎఎస్ అధికారులకు కలెక్టర్లుగా నియమించడంతో వారు నిర్వహించాల్సిన బాధ్యతలపై సిఎం చర్చించనున్నారు. సమావేశంలో రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలపై, సాధించాల్సిన లక్ష్యాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్న నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై కలెక్టర్ల సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావల్సిన నిధుల్లో భారీ కోత కారణంగా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చంచనున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మున్సిపాలిటీలకు ఇటీవలె పాలక మండళ్లు ఏర్పాటు కావడం, కొత్తాగా వచ్చిన మున్సిపాలిటీ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు తీసుకోవల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ చట్టంలో కలెక్టర్లకు విస్తృత అధికారులుండటంతో తీసుకోవల్సిన చర్యలు, మున్సిపాలిటీల అభివృద్ధిపై రూపొందించే సమగ్ర నివేదికలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే బడ్జెట్ సమావేశాలకు ముందుగా కలెక్టర్ల సమావేశం ఉండటంతో జిల్లాలవారిగా అమలవుతున్నపథకాలు, నిధుల మంజూరుపై కూడా చర్చించనున్నారని తెలిసింది. వీటితో పాటు పన్నుల పెంపకం అంశాన్ని కూడా చర్చించనున్నట్లు తెలిసింది.