బండ్లగూడ ఇన్‌స్పెక్టర్‌ సహా.. ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్‌

 సీఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి నివేదిక ఆధారంగా బుధవారం బండ్లగూడ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షాకీర్‌ అలీ, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ రమేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చాంద్రాయణగుట్ట సీఆర్‌పీఎఫ్‌ క్యాంపస్‌కు చెందిన రిటైర్డ్‌ జవాన్‌ ముఖలింగం ప్రస్తుతం ఫలక్‌నుమా ఎస్‌పీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి కారు ముందు మద్యం మత్తులో ఉన్న నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మూత్ర విసర్జన చేసే ప్రయత్నం చేశారు. గమనించిన ముఖలింగం తన కారు ముందు మూత్ర విసర్జన చేయవద్దని మందలించాడు. మాకే అడ్డు చెబుతావా.. అంటూ జవాన్లు ముఖలింగంపై దాడి చేశారు. దెబ్బలకు అతడు కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న ముఖలింగం భార్య (మహిళా కానిస్టేబుల్‌) బయటకు వచ్చి, భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ జవాన్లు ఆమె పైకూడా దాడి చేశారు.

దీంతో భార్యాభర్తలిద్దరూ జనవరి నెలలో బండ్లగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షాకీర్‌ అలీ, ఎస్సై వెంకటేశ్వర్లు నిందితులకు 41ఏ సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, కేసు నమోదు చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ నిందితులపై చర్యలు తీసుకోలేదని.. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు పలుమార్లు స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు సరైన సమాధానం చెప్పకపోవడంతోపాటు బాధితులతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షాకీర్‌ అలీ, ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ రమేశ్‌ మాట్లాడిన మాటలను బాధితులు రికార్డు చేసి, సీపీ శ్రీనివాస్‌రెడ్డిని కలిశారు. బాధితులు రికార్డ్‌ చేసిన వాయిస్‌ను విన్న సీపీ విచారణ చేపట్టి.. ముగ్గురిని సస్పెండ్‌ చేశారు.